
తిరుపతిలో ప్రతి ఏటా పెద్ద ఎత్తున గంగమ్మ జాతరను నిర్వహించడం ఆనవాయితి. అసలు ఎందుకు ఈ గంగమ్మ జాతరను నిర్వహిస్తున్నారు? దీని వెనుక కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం తిరుపతిని పాలెగాళ్లు పరిపాలించే రోజుల్లో ఒక పాలెగాడు తన రాజ్యంలోని అందమైన యువతులను బలాత్కరించేవాడట. కొత్తగా పెళ్ళైన వధువులంతా మొదటిరాత్రి తనతో గడపాలంటూ ఆంక్షలు విధించాడట. ఈ పాలెగాడిని అంతమొందించి స్త్రీ జాతిని రక్షించేందుకు జగన్మాత తిరుపతికి 2 కి.మీ దూరంలోని అవిలాల గ్రామంలో కైకాల కులంలో గంగమ్మగా జన్మించిందని భక్తులు భావిస్తారు.
యుక్తవయసుకొచ్చిన గంగమ్మపై యథావిధిగా పాలెగాడి కన్నుపడి ఆమెను బలాత్కరించబోయాడట. దీంతో గంగమ్మ తన విశ్వరూపాన్ని ప్రదర్శించిందట. తనను అంతమొందించేందుకు అవతరించిన పరాశక్తే గంగమ్మ అని తెలుసుకున్న పాలెగాడు పారిపోయి దాక్కున్నాడట. వాడిని వెతుకుతూ గంగమ్మ అనేక వేషాలు ధరించి మూడు రోజులపాటు గాలించిందట. అయినా పాలెగాడు దొరకలేదు. నాలుగోరోజు గంగమ్మ-దొరవేషం వేసిందట. దీంతో తన ప్రభువైన దొర వచ్చాడనుకుని పాలెగాడు బయటకు రాగానే వాడి తల నరికి సంహరించిందట. ఈ దుష్టశిక్షణను తలచుకుంటూ ఆ తల్లి తమను చల్లగా కాపాడాలని కోరుకుంటూ ఏటా ప్రజలు ఈ జాతర చేస్తున్నారు.
