సీతారాముల కల్యాణం అనగానే గుర్తొచ్చేది భద్రాద్రి. ఇక స్వామి వారి కల్యాణంలోని భద్రాచలం ఆలయానికి అనుబంధంగా ఉన్న మిథిలా స్టేడియంలో జరుగుతుంది. అప్పట్లో రామదాసు స్వామి వారి కల్యాణం సకల జనులు వీక్షించేలా ఆరు బయట జరగాలని ఆదేశించారు.అప్పటి నుంచి ఆరుబయటే జరుగుతోంది. ఇక మిథిలా స్టేడియాన్ని నిర్మించి ఆరు దశాబ్దాలవుతోంది. దీని ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు. అపురూప శిల్ప సంపదకు ఈ స్టేడియం నిలయం. రామాయణంలోని ప్రధాన ఘట్టాలన్నింటినీ ఈ స్టేడియంలో పొందుపరిచారు.
తమిళనాడుకు చెందిన ప్రముఖ శిల్పకళాకారుడు గణపతి స్తపతి ఈ స్టేడియంలో తన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. రామదాసు భద్రాద్రి ఆలయాన్ని నిర్మిస్తున్న సమయంలో జరిగిన సంఘటనలన్నింటినీ కూడా కళ్లకు కట్టేలా గణపతి స్తపతి చెక్కారు. రామాయణ చరిత్ర మొత్తం ఈ స్టేడియంలో మనం చూడవచ్చు. ముఖ్యంగా మండపం పైభాగంలో ఉన్న రాసి చక్రం మిథిలా స్టేడియానికి ప్రధాన ఆకర్షణ. ఐదు ఎకరాల స్థలంలో ఈ స్టేడియాన్ని నిర్మించారు. దాదాపు 20 వేల మంది ఒకే చోట కూర్చొని భద్రాద్రి సీతారాముల కల్యాణాన్ని వీక్షించవచ్చు.