
మహంకాళి అమ్మవారి బోనాల పండుగ రెండు రోజుల పాటు జరుగుతుందని తెలుసుకున్నాం కదా. తొలి రోజున భక్తులు అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. ఇక పండుగ రెండవ రోజున రంగం పేరుతో అమ్మవారు స్వరూపంగా భావించే మహిళ చెప్పే భవిష్యవాణి ఈ రెండు రోజుల జాతరలో కీలకం. భవిష్యవాణిలో ఈ ఏడాది వర్షాలు ఎలా కురుస్తాయో, ప్రజలు సుఖశాంతులతో ఉండాలంటే ఏమి చెయ్యాలో ఇవన్నీ చెబుతారు. ఇందుకోసం ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఈ ఏడాది కూడా భవిష్యవాణి ఏం చెబుతోందనని భక్తులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ ఆషాడంలో అమ్మవారికి మట్టి కుండలో తయారు చేసిన భోజనంతో పాటు పసుపు కుంకుమ వేపాకులు వంటివి సమర్పించడం వెనుక ఉన్న అంతరార్థం ఏమిటో తెలుసుకుందాం. ఇలా శాస్త్రోక్తంగా తయారు చేసిన భోజనం అమ్మవారి ప్రసాదంగా అందరూ తింటారు. ఈ ప్రసాదం ఎంత ఎంత పవిత్రమైనదో అంతే పరిశుభ్రమైనది. మట్టికుండలో తయారు చేసే బోనం పరమ పవిత్రమైనది. మట్టికుండలో పదార్ధాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని శాస్త్రీయ పరంగా కూడా రుజువైంది. బోనాలు సమర్పించే మట్టి కుండకు సున్నం, పసుపు, వేపాకులు పెట్టడం వల్ల అందులోకి ఎటువంటి చెడు క్రిమి కీటకాలు రావు.
ఇవన్నీ యాంటీ సెప్టిక్, యాంటీబయాటిక్ కి సంబంధించినవే కాబట్టి ఈ బోనానికి ఇంత పవిత్రత, పరిశుభ్రత ఉంటుంది. ఈ ప్రసాదం తినడం వలన వర్షాకాలంలో వచ్చే మలేరియా, కలరా వంటి అంటు రోగాలు ప్రబలకుండా కాపాడుతాయి. ఆషాడం బోనాల జాతరలో అమ్మవారిని దర్శించుకొని మొక్కుకుంటే తీరని కోరిక ఉండదు. ఈ ఏడాది కోరుకొని, అనుకున్న పనులు పూర్తయ్యాక వచ్చే ఏడాది మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ. ఊరు ఊరంతా ఒక చోట చేరి భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునే ఈ బోనాల పండుగను మనం కూడా ఆనందంగా జరుపుకుందాం. అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుదాం.
