తమిళనాట విశేషంగా భావించే పెరటాసి మాసం ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. అక్టోబర్ 17 వరకూ ఈ పెరటాసి మాసం కొనసాగనుంది. అయితే ఈ పెరటాసి మాసం కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుని ఆరాధించుకునేందుకు అత్యంత శ్రేష్ణమైన మాసంగా భావిస్తూ ఉంటారు. ఏ మాసాన్ని పెరటాసి మాసంగా వ్యవహరిస్తారు? పెరటాసి మాసం ఎందుకంత ప్రత్యేకం? అనే విషయాలను తెలుసుకుందాం. 12 మాసాలు కలిపితే సంవత్సరం.. అయితే ఈ మాసాల పేర్లు తమిళం, తెలుగులో వేరువేరుగా ఉంటాయి. తెలుగు మాసాలను చాంద్రమానం ప్రకారం.. తమిళ మాసాలను సౌరమానం ప్రకారం లెక్కిస్తారు.
ఈ క్రమంలోనే తమిళ సంప్రదాయం ప్రకారం ఆరో నెలను పెరటాసి మాసంగా వ్యవహరిస్తారు. దీనినే పెరుమాళ్ అని కూడా అంటారు. మరి ఈ పెరటాసి మాసం ఎందుకంత ప్రత్యేకమంటే.. శ్రీమహావిష్ణువు శ్రీనివాసునిగా పెరటాసి మాసంలోని శ్రవణ నక్షత్రంలో అవతరించాడని వేంకటాచల మహత్స్యం చెబుతోంది. అలాగే శ్రీనివాసుడు తిరు నక్షత్రమైన శ్రవణ నక్షత్రం రోజునే ఏడుకొండలపై వెలిశాడని పండితులు చెబుతారు. ఈ విషయాన్ని వ్యాస మహర్షి రచించిన ‘శ్రీ వేంకటాచల మాహాత్మ్యం’లో చెప్పడం జరిగింది. అందుకే పెరటాసి మాసం శ్రీ వేంకటేశ్వరుని ఆరాధనకు అత్యంత శ్రేష్టమైనదని అంటారు.