మహారాష్ట్రలోని అష్ట వినాయక క్షేత్రంలో కొలువైన బల్లాలేశ్వర్ ఆలయ స్థల పురాణం చాలా పెద్దదే. ఈ ఆలయం మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో రోహా నుంచి 28 కి.మీ దూరంలో ఉన్న పాలీ అనే గ్రామంలో ఉంది. ఈ పాలీ గ్రామాన్ని అప్పట్లో పల్లిపుర్ అనేవారు. ఈ గ్రామంలో కల్యాణ్ అనే వ్యాపారస్థుడు ఉండేవాడు. అతని కుమారుడు ‘బల్లాల్’ చిన్నవయసు నుంచే వినాయకుడి భక్తుడు. చిన్న చిన్న రాళ్లనే పోగేసి వాటినే వినాయకుడి మూర్తులుగా భావించి స్నేహితులతో కలిసి అడవిలో ఆటలాడుతూ ఉండేవాడు. ఒకరోజు అడవిలో వారికి పెద్ద రాయి దొరికింది. ఆ రాతిని వినాయకుడిగా భావించి పూజ చేస్తే రాత్రి అయింది కూడా గమనించలేదు. ఇలా ఒకరోజు కాదు.. నిత్యం జరుగుతోంది. దీంతో పిల్లల తల్లిదండ్రులు కల్యాణ్ సేఠ్‌కి ఫిర్యాదు చేశారు.
మీ కుమారుడు బల్లాల్ కారణంగానే తమ పిల్లలు చెడిపోతున్నారని నిందించాడు. దీంతో ఆగ్రహించిన కల్యాణ్ సేఠ్ బల్లాల్‌ని అడవికి తీసుకెళ్లి చెట్టుకు కట్టేసి చితక్కొట్టాడు. అతను వినాయకుడిగా తలచి పూజిస్తున్న రాయిని నేలకేసి కొట్టాడు. బల్లాల్‌ను అక్కడే వదిలేసి అతని తండ్రి వెళ్లిపోయాడు. బల్లాల్ గణేష్ నామాన్ని జపిస్తూ మూర్ఛపోయాడు. అప్పుడు వినాయకుడు సాధువుగా వచ్చి అతని కట్లు విప్పి విడిపించాడు. ఆయన స్పర్శతో బల్లాల్ ఒంటిపై దెబ్బలన్నీ మాయమయ్యాయి. వినాయకుడిని గుర్తించిన బల్లాలపై స్వామివారి కాళ్లకు మొక్కాడు. అప్పుడు వినాయకుడు ఏ వరం కావాలో కోరుకోమని చెప్పగా.. తన తండ్రి పగులగొట్టిన రాతిలోనే ఉండాలని కోరుకున్నాడు. బల్లాల్ భక్తి విశ్వాసాలకు ముగ్ధుడై అతని పేరును తన పేరుకు ముందు తగిలించుకుని బల్లాలేశ్వర్‌గా అక్కడే ఉండిపోయి పూజలందుకుంటున్నాడు. ఆయనకు తరువాత చెక్కతో ఆలయాన్ని నిర్మించారు.