తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఈ నెల 18 నుంచి పవిత్రోత్సవాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా కొనసాగిన పవిత్రోత్సవాలు మహా పూర్ణాహుతితో నిన్న ముగిశాయి. పవిత్రోత్సవాల్లో భాగంగా జూలై 18న పవిత్ర ప్రతిష్ఠ, జూలై 19న గ్రంథి పవిత్ర సమర్పణ వంటి కార్యక్రమాలు జరిగాయి. ఇక నిన్న శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు శనివారం మహాపూర్ణాహుతితో వైభవంగా ముగిశాయి.
పూర్ణాహుతిలో భాగంగా ఉదయం యాగశాలపూజ, హోమం, మహాపూర్ణాహుతి, కలశోధ్వాసన, మూలవర్లకు కలశాభిషేకం, పట్టుపవిత్ర సమర్పణ చేపట్టారు. సాయంత్రం పంచమూర్తులైన శ్రీసోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వరస్వామి, వళ్లి దేవసేన సమేత శ్రీసుబ్రమణ్యస్వామి, శ్రీ చండికేశ్వరస్వామివారి వీధి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. పవిత్రోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు పవిత్రమాల, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్రబాబు, ఏఈఓ శ్రీ సుబ్బరాజు, సూపరింటెండెంట్ శ్రీ కృష్ణ వర్మ, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ బాలకృష్ణ, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.