మొదటి రోజు మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ఇవాళ తెల్లవారుజామున ప్రశాంతంగా ముగిశాయి. నిన్న తెల్లవారు జామున ప్రభుత్వం తరుపున మొదటి బోనం సమర్పించడంతో ప్రారంభమై అమ్మవారి బోనాల ప్రక్రియ ముగియనుంది. లక్షలాది మంది భక్తుల మొక్కులు, వేలాది బోనాల సమర్పణ తో అంగరంగ వైభవంగా మహంకాళి అమ్మవారి బోనాలు కొనసాగాయి. పోత రాజుల ఆటపాటలతో ఫలహారం బండి ఊరేగుంపులతో ఈ రోజు తెల్లవారు జామున తొలి రోజు బోనాల సంబరాలు ముగిశాయి.
మహంకాళి ఆలయంలో రెండో రోజు సైతం భక్తుల రద్దీ కొనసాగుతోంది. పైగా ఇవాళ కీలక ఘట్టమైన రంగం భవిష్యవాణి కార్యక్రమం జరుగనుంది. వడి బియ్యం, చీరా సారెలతో అమ్మవారికి భక్తులు మొక్కులు సమర్పిస్తున్నారు. రంగం భవిష్యవాణి, ఏనుగు అంబారీపై అమ్మవారి ఊరేగింపుతో నేడు ఉజ్జయిని అమ్మవారి బోనాల జాతర ముగియనుంది. పచ్చి కుండ పై నిలబడి మాతంగి చెప్పే భవిష్యవాణి పై భక్తుల విపరీతమైన ఆసక్తి కనబరుస్తుంటారు. అమ్మవారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందని భక్తుల నమ్మకం. ఉదయం 9 గంటల తరువాత రంగం భవిష్యవాణి ఉండే అవకాశం ఉంది.