
పరమ శివుడు ప్రతి ఏటా శీతాకాలంలో సహజ సిద్ధంగా ఏర్పడి భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. ప్రతి ఏటా అమర్నాథ్ యాత్ర కోసం భక్తులు పెద్ద ఎత్తున బయలుదేరుతుంటారు. ఈ యాత్ర అత్యంత వ్యయప్రయాసలతో కూడుకున్నది అయినా కూడా ప్రతి హిందువూ తన జీవితకాలంలో ఒకసారైనా అమర్నాథ్ యాత్ర చేయాలనుకుంటారు. సముద్ర మట్టానికి 3,888 మీటర్ల ఎత్తులో జమ్ము-కాశ్మీర్లోని హిమశిఖరాల మధ్య.. ఈ అమర్నాథ్ గుహ ఉంటుంది. ఏడాది మొత్తంలో కొన్ని రోజుల పాటు మాత్రమే మంచు శివలింగం రూపంలో శివయ్య దర్శనమిస్తూ ఉంటాడు. ఈ ఏడాది జూన్ 29న అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది.
ప్రతియేటా ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉండే ఈ అమర్ నాథ్ యాత్ర ప్రశాంతంగా ముగిసింది. గడిచిన 12 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర కొనసాగి శ్రావణ పూర్ణిమ రోజున పూర్తియింది. ఈ ఏడాది 5.1 లక్షల మంది యాత్రికులు మంచు శివలింగాన్ని దర్శనం చేసుకున్నారని ఆలయ అధికారులు చెబుతున్నారు. 2011, 2012లో వరుసగా 6.35 లక్షలు, 6.22 లక్షల మంది భక్తులు మంచు శివలింగాన్ని దర్శించుకోగా ఆ తరువాత రెండేళ్లు సగానికి భక్తుల సంఖ్య పడిపోయింది. తిరిగి ఈ ఏడాది కాస్త పుంజుకుంది. 2022లో 3.65 లక్షల మంది యాత్రికులు, 2023లో 4.45 లక్షల మంది యాత్రికులు దర్శించుకోగా ఈ ఏడాది 5 లక్షలకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
