జోతి ఆత్మ స్వరూపం. అలాంటి ఆత్మ స్వరూపం ఎల్లెడలా ప్రకాశిస్తుంది. జ్యోతి స్వరూపమైన పరమాత్మ అందరిలోనూ ప్రకాశిస్తుంటాడు. ఆ పరమాత్మ అనే జ్యోతి వల్లనే ఈ జగత్తు, సూర్య చంద్రులు వెలుగుతున్నారు. ఆ పరమాత్మ అనే జ్యోతిస్సు లేకపోతే అంతా అంధకారమై పోయేది. అందుకే భారతీయ సంస్కృతిలో జ్యోతికి అంత ప్రాధాన్యం. అందువల్లే మనకు దీపారాధన సంప్రదాయం అయింది. మనం భగవంతుణ్ణి “తమసోమా జ్యోతిర్గమయ” అని ప్రార్థించాలని ఉపనిషత్తు చెప్పింది. తమస్సు (చీకటి) నుంచి ఉషస్సు (వెలుగు) లోకి తీసుకువెళ్లమని మనం ఆ పరమాత్మను ప్రార్థిస్తాం.
నా అజ్ఞానాన్ని పటాపంచలు చేసి జ్ఞానాన్ని ప్రసాదించమని దాని అంతరార్థం. అంధకారం అజ్ఞానానికి ప్రతీక. జ్యోతిస్సు జ్ఞానానికి ప్రతీక. మనలోని అజ్ఞానాంధకారం నివృత్తి కావాలి. మనలో జ్ఞాన జ్యోతులు వెలగాలి. ఆ విధమైన జ్ఞానం కలగాలని ఆ భగవంతుణ్ని ప్రార్ధిద్దాం. ఆ దివ్య జ్యోతిని చూస్తుంటే, మనకు అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది. మన సంస్కృతిలో జ్యోతి ప్రజ్వలనకు విశేష స్థానం ఉంది. ఏదైనా కార్యక్రమం జ్యోతి వెలిగించి ప్రారంభించడం మన సంప్రదాయం. కార్తిక మాసంలో దీపాలు వెలిగించడం జన్మరాహిత్యానికి మార్గం చూపుతుందని కార్తిక పురాణం చెబుతోంది. భక్తిటీవి ప్రతిఏటా నిర్వహించే దీపోత్సవంలో పాల్గొని, ఈ మహిమాన్విత కార్తిక మాసంలో ఆ పరమేశ్వరుని సన్నిధిలో దీపాలు వెలిగించి, ఆయన కృపకు పాత్రులు కండి. సర్వేజనాః సుఖినో భవంతు. 2012లో భక్తిటీవీ నిర్వహించిన లక్షదీపోత్సవంలో శ్రీస్వామివారు చేసిన అనుగ్రహభాషణం.