తిరుమల శ్రీవారి ఆలయంలోని శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి జూన్ 16వ తేదీన ప్రత్యేక సహస్ర కలశాభిషేకం జరుగనుంది. గత 18 ఏళ్లుగా శ్రీవారి ఆలయంలో టీటీడీ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నది. ఈ సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి 8.30 గంటల నడుమ శ్రీవారి ఆలయంలోని బంగారువాకిలి చెంత భోగ శ్రీనివాసమూర్తికి అర్చక స్వాములు ఏకాంతంగా సహస్ర కలశాభిషేకం నిర్వహిస్తారు. శ్రీవారి ఆలయంలోని ఆర్జిత సేవలన్నీ యథావిధిగా కొనసాగుతాయి.
చారిత్రక నేపథ్యం :
పల్లవ రాణి సామవాయి పెరుందేవి క్రీ.శ 614వ సంవత్సరంలో జ్యేష్ఠ మాసంలో 18 అంగుళాల పొడవుగల వెండి భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని తిరుమల శ్రీవారి ఆలయానికి కానుకగా సమర్పించారు. ఇందుకు గుర్తుగా ప్రతి సంవత్సరం ఆలయంలో శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి సహస్రకలశాభిషేకం నిర్వహిస్తారు. పల్లవరాణి కానుకకు సంబంధించిన ఈ శాసనం ఆలయ మొదటి ప్రాకారంలోని విమాన వేంకటేశ్వరుని విగ్రహం కింది భాగంలో గోడపైన కనిపిస్తుంది. ఆగమం ప్రకారం శ్రీవారి ఆలయంలోని పంచబేరాల్లో ఒకరైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని కౌతుకమూర్తి అని, శ్రీ మనవాళపెరుమాళ్ అని కూడా పిలుస్తారు.