తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి లడ్డూపై దేశ వ్యాప్తంగా దుమారం రేగుతోంది. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారంటూ వస్తున్న వార్తలు పెద్ద ఎత్తున సంచలనంగా మారాయి. ఈ క్రమంలోనే తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమలలో కల్తీ నెయ్యి, అపచారాలు, అరాచకాలు, అధికార దుర్వినియోగంపై విచారణకు సిట్‌ను నియమించింది. ఆదివారం రాత్రి ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబు విలేకరులతో మాట్లాడుతూ.. ఐజీ, అంతకంటే పైస్థాయి అధికారి ఆధ్వర్యంలో సిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. సిట్ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చంద్రబాబు వెల్లడించారు. అలాగే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని సీఎం హామీ ఇచ్చారు.
ప్రజల మనోభావాలతో ఆడుకునే హక్కు ఎవరికీ లేదని.. ప్రతి దేవాలయంలో సంప్రదాయాలు, ఆచారాలను గౌరవించాల్సిందేనని.. ఇందులో రాజీపడే ప్రసక్తే లేదని చంద్రబాబు పేర్కొన్నారు. మొత్తం దేవాలయాల నిర్వహణపై అక్కడి పద్ధతులకు అనుగుణంగా.. పాలన, ఆగమశాస్త్రం తెలిసిన వైదిక, ధార్మిక, ఆగమ పండితులతో ఒక కమిటీ వేసి సమగ్ర నిర్వహణ విధానాలు రూపొందించడంతో పాటు తప్పని సరిగా విది విధానాలు అమలు చేస్తామని వెల్లడించారు. అన్ని దేవాలయాల్లో మహిళలకు గౌరవం లభించేలా చూస్తామని.. దీనిపైనా కమిటీ ద్వారా సిఫారసులు తీసుకుంటామని చంద్రబాబు పేర్కొన్నారు. దేవాలయాలు, మసీదులు, చర్చిలన్నింటిలో మతసామరస్యం కాపాడుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.