సికింద్రాబాద్ బోనాలు, రంగం ఎప్పుడంటే..

హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో బోనాల జాతర నడుస్తోంది. ఆదివారం వచ్చిందంటే నగరంలో సందడి ప్రారంభమవుతుంది. గత వారం హైదరాబాద్ బోనమెత్తగా ఇక ఇప్పుడు సికింద్రాబాద్ వంతు వచ్చేసింది. ఈ నెల 21న సికింద్రాబాద్ బోనాలు జరగనున్నాయి. సికింద్రాబాద్ లోని మహంకాళి ఆలయం వద్ద అధికారులతో కలిసి ఇవాళ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు. ఈ నెల 21న బోనాలు జరగనున్నాయని.. 22 న రంగం ( భవిష్యవాణి) నిర్వహించనున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే లక్షలాదిమంది భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ఏర్పాట్లు చేయాలని తలసాని సూచించారు.

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ప్రతి ఏటా పెద్ద ఎత్తున జరుపుకుంటూ ఉంటారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇక బోనాల వేడుకల్లో ప్రధాన ఘట్టం వచ్చేసి రంగం. అది ఈ నెల 22న జరగనుంది. రాష్ట్రం ఈ ఏడాది ఎలా ఉండబోతుందనే విషయాలను ఈ రంగం కార్యక్రమం ద్వారా అమ్మ చెబుతుందట. అవివాహిత అయిన జోగిని శరీరంపై ఆవహించి.. అమ్మవారు భవిష్యవాణి పలకనుంది. ఇక రంగంలో అమ్మవారు పలికే వాక్కు తప్పక నిజమవుతుందని భక్తుల నమ్మకం. అందుకే ఈ కార్యక్రమం కోసం భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు.

Share this post with your friends