ఫిబ్రవరి 4న శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో రథసప్తమి

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి 4వ తేదీన రథసప్తమి పర్వదినం వైభవంగా జరుగనుంది. ఈ సందర్భంగా స్వామివారు దేవేరులతో కలిసి ఏడు వాహనాలపై ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు. తెల్లవారు జామున 3 నుండి 5 గంటల వరకు శ్రీచక్రత్తాళ్వార్‌ను ఊరేగింపుగా శ్రీ కపిలేశ్వరస్వామి వారి ఆలయంలోని ఆళ్వారు తీర్థానికి వేంచేపు చేసి చక్రస్నానం నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 5.30 నుండి 7.30 గంటల వరకు సూర్యప్రభ వాహనంతో శ్రీగోవిందరాజస్వామి వారి వాహన సేవలు ప్రారంభమవుతాయి.

ఉదయం 8 నుండి 9 గంటల వరకు హంస వాహనం, ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు హనుమంత వాహనంపై స్వామివారు ఊరేగనున్నారు. ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పెద్దశేష వాహనం, మధ్యాహ్నం 1 నుండి 2.30 గంటల వరకు ముత్యపు పందిరి వాహనం, మధ్యాహ్నం 3 నుండి 4.30 గంటల వరకు సర్వభూపాల వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు ఊరేగుతూ భక్తులను అనుగ్రహించనున్నారు. రాత్రి 7 నుండి రాత్రి 8.30 గంటల వరకు గరుడ వాహనాన్ని అధిష్టించి శ్రీవారు దర్శనమిస్తారు. రథసప్తమి వేడుకలను అర్ధ బ్రహ్మోత్సవమని, ఒక రోజు బ్రహ్మోత్సవమని కూడా భక్తులు అంటారు.

Share this post with your friends