
తిరుమల తిరుపతి పాలక మండలి ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. 24 మందితో ధర్మకర్తల మండలి ఏర్పాటు కానుంది. ఈ 24 మందిలో సగం మంది సొంత రాష్ట్రం అంటే ఏపీకి చెందిన వారైతే మిగిలిన సగం ఇతర రాష్ట్రాల సభ్యుల టీటీడీ పాలక మండలి ఏర్పాటైంది. టీటీడీ బోర్డుకు చాలా మంది పోటీ పడ్డారు. బీఆర్ నాయుడు చైర్మన్గా టీటీడీ పాలక మండలి ఏర్పాటైంది. దేశంలోని ప్రముఖ రంగాలకు చెందిన ప్రముఖులకు బోర్డులో స్థానం లభించింది. చైర్మన్ సహా 12 మంది స్వరాష్ట్రానికి చెందిన వారిని.. మరో 12 మందిని ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని ఏపీ సర్కార్ ఎంపిక చేసింది.
పాలక మండలిలో మహిళలకు పెద్ద పీట వేసింది. చైర్మన్‌తో పాటు ముగ్గురు ఉమ్మడి చిత్తూరు జిల్లా వారికి బోర్డులో అవకాశం లభించింది. తిరుమల పవిత్రతను కాపాడటమే లక్ష్యమని చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. భక్తులకు సంతృప్తికరమైన స్వామివారి దర్శనం కల్పించడమే లక్ష్యమని వెల్లడించారు. టీటీడీలో శ్రీవాణి ట్రస్ట్ వ్యవహారం అత్యంత వివాదాస్పదంగా మారింది. ఈ క్రమంలోనే కొత్త పాలక మండలి ముందుగా ఈ వ్యవహారంపై దృష్టి సారించబోతున్నట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వ నిర్ణయాల కారణంగా చాలా అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. వీటన్నింటినీ కొత్త పాలక మండలి ఎలా సరిదిద్దుతుందో చూడాలి.
