హనుమంతుడి గానానికి తరలివచ్చిన విష్ణుమూర్తి..

మొత్తానికి నారదుడికి, తుంబురుడికి మరోసారి పోటీ జరిగింది. హనుమంతుడు న్యాయ నిర్ణేతగా వచ్చాడు. ఇద్దరూ తమ గానంతో దేవతలను మంత్రముగ్దులను చేశారు. దీంతో హనుమంతుడి తీర్పు ఎలా ఉంటుందోనని ఆత్రంగా చూడసాగారు. ‘ఇద్దరూ సమ ఉజ్జీలుగానే ఉన్నారు. ఇంకో పరీక్ష పెడతాను. మీ వీణలు ఇలా ఇవ్వండి’ అడిగాడు హనుమంతుడు. ఇద్దరూ తమ వీణలను ఆంజనేయుడి చేతికి అందించారు. హనుమంతుడు రెండు వీణలనూ తీసుకుని, రెండింటిలోని చెరో మెట్టును ఊడదీసి వారికి ఇచ్చాడు. ‘ఇప్పుడు వీణ వాయిస్తూ గానం చేయండి’ అన్నాడు. దీంతో తుంబుర నారదులిద్దరూ అసహనానికి గురయ్యారు. ‘వీణలో అన్ని మెట్లూ ఉంటేనే కదా వాయించగలం. చెరో మెట్టు తీసేసి ఇప్పుడు వాయించమంటే ఎలా?’ అని అడిగారు. హనుమంతుడు చిరునవ్వు నవ్వాడు.

ఎదురుగా కనిపించిన ఒక వెదురు బొంగును తీసుకుని, దాన్ని చీల్చాడు. దానికి తీగలు తగిలించాడు. ఎలాంటి మెట్లులేని వీణను తయారు చేశాడు. ఇక దానిని వాయిస్తూ గానం చేయడం మొదలుపెట్టాడు. మంద్రంగా మొదలైన స్వరఝరి క్రమంగా ఉధృతి అందుకుంది. ఆ గానానికి వైకుంఠం నుంచి మహావిష్ణువే పరుగున అక్కడికి వచ్చినా, అతడి రాకను గుర్తించలేనంతగా అక్కడి దేవతలందరూ తన్మయులయ్యారు. హనుమంతుడు తన గానాన్ని ముగించిన తర్వాత తుంబుర నారదులిద్దరూ సంగీతంలో తమ విద్వత్తు ఇంకా పరిపూర్ణం కాదని అంగీకరించారు. హనుమతుండి గానంతో తమ కళ్లు తెరుచుకున్నాయని అన్నారు. వారి మాటలతో బాహ్యస్పృహలోకి వచ్చిన దేవతలు అక్కడకు వచ్చిన మహావిష్ణువును గమనించారు. ఆయన అభిప్రాయం కోరారు. తుంబుర నారదులిద్దరూ తన భక్తులే అయినా, ఇద్దరిలోనూ ఇంకా అహం పూర్తిగా నశించలేదని, అందుకే వారు తమ విద్యలో ఇంకా పరిపూర్ణత సాధించలేక పోయారని, అహాన్ని వీడటం వల్లనే హనుమంతుడు పరిపూర్ణత సాధించగలిగాడని వివరించాడు విష్ణువు. అహం ఉన్నంత కాలం ఏ విద్యలోనూ పరిపూర్ణత లభించదు. అహం వీడితేనే పరిపూర్ణత సాధ్యం.

Share this post with your friends