బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో అక్షరాభ్యాస వివాదం..

దేశంలోనే ప్రముఖ శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయాల్లో బాసర ఫేమస్. ప్రతి ఒక్కరూ తమ చిన్నారులకు బాసరలోనే అక్షరాభ్యాసం చేయించాలని భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇక్కడ ఏటా వసంత పంచమి రోజున పెద్ద ఎత్తున అక్షరాభ్యాసాలు జరుగుతూ ఉంటాయి. తాజాగా ఈ ఆయలంలో ఓ వివాదం చోటు చేసుకుంది. ఇక్కడ కొందరు శాస్త్ర విరుద్ధంగా అక్షరాభ్యాసం చేయిస్తున్నారంటూ అనుష్టాన పరిషత్ ఆరోపిస్తోంది. పలక లేదంటే బియ్యంపై ఇంతకు ముందు అక్షరాభ్యాసం చేయించేవారు. కొత్తగా వచ్చిన ప్రైవేటు వ్యక్తులు మాత్రం నాలుకపై బీజాక్షరాలు రాస్తున్నారు.

ఇలా నాలుకపై బీజాక్షరాలు రాయించడం గుడి సంప్రదాయాన్ని దెబ్బతీయడమేనని.. కాబట్టి అలాంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని అనుష్టాన పరిషత్ తీర్మానించి అధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే ఆలయ ఈవో సైతం ఇప్పటికే నాలుకపై బీజాక్షరాలతో చేసే అక్షరాభ్యాసం చేయించే వాళ్లను నమ్మొద్దంటూ పోస్టర్లను సైతం ఏర్పాటు చేశారు. ఇలా బీజాక్షరాలతో అక్షరాభ్యాసాలు నిర్వహించడం ఆగమ శాస్త్ర విరుద్ధమని అనుష్ఠాన పరిషత్ ఆరోపిస్తోంది. ఆలయ ప్రధాన అర్చకులు సైతం దీనిని వ్యతిరేకిస్తున్నారు.

Share this post with your friends