అమర్‌నాథ్ యాత్రకు వేళైంది.. ఇప్పటికే జమ్మూకి చేరుకున్న తొలి బ్యాచ్..

హిందువులు ఎంతగానో ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. అమరనాథ్ యాత్రను జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జమ్మూ బేస్ క్యాంపు నుంచి జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ మొదటి బ్యాచ్ జమ్మూ నుంచి బయలుదేరనుంది. కట్టుదిట్టమైన భద్రతా ఎస్కార్ట్ నడుమ కశ్మీర్‌లోని జంట బేస్ క్యాంపులకు చేరనుంది. ఇక్కడి నుంచే అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. రేపటి యాత్ర కోసం ఇప్పటికే జమ్మూ చేరుకున్న యాత్రీకులంతా అమర్‌నాథ్‌ బేస్‌ క్యాంపులో గురువారం సాయంత్రం జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎలాంటి ఆటంకమూ లేకుండా తమ యాత్ర కొనసాగేలా చూడాలని వినాయకుడిని వేడుకున్నారు.

రేపు పహల్గామ్, బల్తాల్ నుంచి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్ర కోసం లక్షల మంది భక్తులు అప్లై చేసుకున్నారు. వీరంతా క్రమక్రమంగా యాత్ర పూర్తి చేసుకోనున్నారు. ఇప్పటికే ఉన్నతాధికారులు భగవతి నగర్‌లోని బేస్ క్యాంప్‌ను పరిశీలించారు. లెఫ్ట్‌నెంట్ గవర్నర్ సైతం యాత్రీకులతో మాట్లాడారు. అధికారులతోనూ భద్రతా చర్యలపై.. అమర్‌నాథ్ యాత్ర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. భద్రత విషయంలోనూ ఎలాంటి లోటు రాకుండా చూడాలని మనోజ్ సిన్హా సూచించారు. 52 రోజుల పాటు అమర్‌నాథ్ యాత్ర కొనసాగనుంది. జంట ట్రాక్‌ల నుంచి ఈ యాత్ర రేపు ప్రారంభం కానుంది. ఆగస్ట్ 19న ముగియనుంది.

Share this post with your friends