సప్తనదుల సంగమేశ్వరాలయం గురించి మనం తెలుసుకున్నాం కదా.. ఈ ఆలయ విశేషాలు అన్నీ ఇన్నీ కావు. ఏడు నెలల పాటు శివలింగం నీటిలోనే ఉన్నా చెక్కుచెదరదని తెలుసుకున్నాం. వాస్తవానికి ఇది వేపదారు శివలింగం. అయినా సరే ఏమాత్రం చెక్కు చెదరకపోవడం చూపరులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆలయంలోని ప్రధాన శివలింగం వేప మొద్దును భీముడు ప్రతిష్టించాడని చెబుతారు. భీముడు ప్రతిష్టించిన శివలింగం కాబట్టే ఎంతో మహిమ కలిగినదని భక్తులు భావిస్తారు. దీనిని దర్శించుకునేందుకు ఆరాటపడుతుంటారు.
సంగమేశ్వర దేవాలయం ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్య క్షేత్రం. ఇది ఆత్మకూరుకు 20 కి.మీ దూరంలో కృష్ణా నదిలో ఉంటుంది. ఏడు నదులు కలిసే చోట ఉంటుంది కాబట్టి దీనిని సప్త నదుల సంగమేశ్వరాలయం అని పిలుస్తారు. తుంగ, భద్ర, కృష్ణ, వేణి, భీమ, మలాపహరిణి, భవనాసి అనే ఏడు నదులు కలుస్తుండటంతో సంగమేశ్వరం అని పిలుస్తారు. ఈ ఆలయానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇది మునుల తపస్సుకు ఆశ్రయిమిచ్చిన ప్రదేశమట. కేవలం ఐదు నెలలు మాత్రమే సంగమేశ్వరాలయంలో కొలువైన శివయ్య భక్తులకు దర్శనమిచ్చి వారు కోరిన కోరికలన్నింటినీ తీరుస్తాడు.