ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహ ఆలయం నవనారసింహ క్షేత్రాల్లో ఒకటి. దక్షిణాభిముఖంగా ప్రవహించే గోదావరి నదీతీరంలో లక్ష్మీనరసింహ స్వామి వారు వెలిశారు. ఈ ఆలయం దక్షిణ కాశీగా విరాజిల్లుతోంది. ఇక తీర్థ రాజంగానూ.. హరిహరక్షేత్రంగానూ భాసిల్లుతోంది. దేశంలో ఎక్కడా కనిపించని విశేషం ఇక్కడ ఒకటి కనిపిస్తుంది. అదేంటంటే.. స్వామివారి ఆలయ ప్రాంగణంలో యమ ధర్మరాజు కోవెల ఉంది. ఈ కారణంగానే ధర్మపురి వస్తే యమపురి ఉండదని పెద్దలు చెబుతారు. యోగానంద రూపుడై భాసిల్లుతున్న స్వామివారి విగ్రహాన్ని సాలగ్రామ శిలతో తయారైంది.
ధర్మపురి స్వామివారిని తలచినంతనే దుఃఖాలన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఇక స్తలపురాణం ప్రకారం.. ధర్మవర్మ అనే మహారాజు ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పాలించడం వల్లే ధర్మపురి అనే పేరు వచ్చింది. అయితే ఈ ఆలయం బహమనీ సుల్తానులు చేసిన దండయాత్రలో ధ్వంసమైంది. ఈ ఆలయానికి వేయి సంవత్సరాల చరిత్ర ఉంది. తిరిగి ఈ ఆలయాన్ని 17వ శతాబ్దంలో పునరుద్ధరించారు. సత్యవతీదేవి పామునే పతిగా పొందిన అనంతరం ఎన్ని ఆలయాలు తిరిగినా ఫలితం దక్కకపోవడంతో ధర్మపురికి వచ్చి స్వామివారిని దర్శించుకుని గోదావరిలో స్నానమాచరించగానే భర్తకు పాము రూపం పోయి సుందర రూపం వచ్చిందట.