అక్షయ తృతీయ.. కొన్ని దశాబ్దాల క్రితమైతే దీనికంత ప్రాధాన్యం లేదనే చెప్పాలి. గత మూడు దశాబ్దాలుగా మాత్రం దీనికి ఎందుకో కానీ భీభత్సమైన ప్రాచుర్యం వచ్చింది. ఈరోజు బంగారం, వెండి, స్థలం, ఇల్లు వంటి విలువైన వస్తువులు కొంటే అవి అక్షయంగా తరిగిపోకుండా ఉంటాయని నమ్మకం. లక్ష్మీదేవి కరుణా కటాక్షం కలుగుతుందని అంతా నమ్ముతారు. సాక్షాత్తు ఈశ్వరుడు పార్వతీదేవికి అక్షయ తృతీయ వ్రతం గురించి వివరించినట్లుగా మత్స్య పురాణం అరవై ఐదవ అధ్యాయం చెబుతోంది. ఈ రోజున చేసే ఏ వ్రతమైనా, హోమమైనా, దానాలైనా, పుణ్య కార్యాచరణ ఏదైనా కూడా ఫలితం అక్షయమౌతుందట.
ఈ రోజున అక్షయుడిగా భావించే విష్ణు మూర్తిని ఆరాధించుకుంటాం కాబట్టి దీనికి అక్షయ తృతీయ అని పేరు. ఇక్కడ కొన్ని విషయాలు మనం తప్పక తెలుసుకోవాలి. ఇవాళ పుణ్యం చేస్తే ఎంత ఫలితముంటుందో.. పాపం చేసినా కూడా అంతే ఫలితం ఉంటుందట. ఇవాళ బంగారం, వెండికైతే బీభత్సమైన డిమాండ్ ఉంటుంది. ఇవి కొంటే నిత్యం ఇంట్లో బంగారం, వెండికి కొదువ రాదని నమ్మకం. కాబట్టి కొందరు అప్పు చేసేనా సరే.. కొనేస్తూ ఉంటారు. అలా అప్పు చేసి కొంటే మాత్రం అప్పులు కూడా అక్షయంగానే ఉంటాయట. కాబట్టి అప్పు చేసి కొనకకూడదు. పుణ్య కార్యాలు ఏవైనా సరే.. చేస్తే వచ్చే ఫలితం అక్షయమైనట్టే పాప కార్యాచరణ వల్ల వచ్చే పాపం కూడా అక్షయమవుతుందట. కాబట్టి జాగ్రత్తగా మసలుకోవాలి.