భారతదేశం ఆధ్మాత్మికతకు నెలవు. ఇక్కడ ఎన్నో మిస్టీరియస్ ఆలయాలున్నాయి. శాస్త్రవేత్తలు సైతం ఛేదించలేని రహస్య దేవాలయాలు చాలా ఉన్నాయి. ఓ శ్రీకృష్ణుడి ఆలయంలోని వింత గురించి తెలిస్తే నోరెళ్లబెడతారు. ఇది సైన్నస్ ఏమాత్రం ఛేదించలేని రహస్యం. అదేంటంటే.. అన్నం తినకుంటే మనషులు సన్నబడటం సహజం. అది కూడా కొద్ది రోజుల పాటు తినకుంటే.. కానీ ఇక్కడి కన్నయ్య మాత్రం సమయానికి నైవేద్యం అందించకున్నా వెంటనే సన్నబడిపోతాడు. ఈ ఆలయం కేరళలోని కొట్టాయం జిల్లాలోని తిరువరప్పులో శ్రీ కృష్ణ భగవానుడి ప్రసిద్ధ, అద్భుత ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని తిరువరప్పు శ్రీకృష్ణ దేవాలయం అని కూడా పిలుస్తారు.
ఈ ఆలయం సుమారు 1500 ఏళ్లనాటి పురాతన ఆలయం. ఈ ఆలయ ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. వాటిలో ఒకటేంటంటే.. ఈ ఆలయ తలుపులు 24 గంటలలో కేవలం 2 నిమిషాలు మాత్రమే మూసివేస్తారు. ఇక నైవేద్యమైతే రోజుకు 10 సార్లు సమర్పిస్తారు. ఎందుకంటే కన్నయ్య ఆకలిని తట్టుకోలేడట. నైవేద్యం సమయానికి అందలేదా? కన్నయ్య వెంటనే చిక్కిపోతాడట. ప్రసాదం స్వామివారి ముందు పెడితే ఆ ప్లేట్ నుంచి కొద్దికొద్దిగా మాయమవుతుందట. శ్రీకృష్ణుడే స్వయంగా ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తాడని నమ్మకం. ఒకసారి గ్రహణ సమయంలో స్వామివారి తలుపులు మూసివేసి ఉన్నందున ఆహారం అందించలేదట. అంతే తెరిచేటప్పటికి కన్నయ్య విగ్రహం ఎండిపోయి.. నడుముకున్న వడ్డాణం జారి పోయి కనిపించిందట. కాబట్టి అప్పటి నుంచి గ్రహణం ఉన్నా సరే ఈ ఆలయాన్ని మాత్రం మూసివేయరు. స్వామివారికి సమయానికి నైవేద్యం అందించాల్సిందే.