దుర్గమ్మను ఎలా పూజించాలి? నైవేద్యంగా ఏం సమర్పించాలి?

దుర్గమ్మను మంగళ, శుక్రవారాల్లో పూజించుకుంటే మంచిదని చెప్పుకున్నాం. అయితే అమ్మవారిని ఎలా పూజించాలి అనేది కూడా తెలుసుకోవాలి. అమ్మవారికి పూజ ఏ రోజున అయితే చేయాలనుకుంటామో ఆ రోజున తెల్లవారుజామునే లేచి పూజగదిని శుభ్రం చేయాలి. పసుపు రాసిన పీటకు కుంకుమ బొట్లు పెట్టి దానిపై ఎర్రని వస్త్రాన్ని పరచి దుర్గాదేవి విగ్రహం లేదంటే చిత్రపటాన్ని పెట్టాలి. ఆ తరువాత అమ్మవారిని సైతం అలంకరించాలి. చిత్ర పటానికి గంధం, కుంకుమ పెట్టి.. ఎర్రని పువ్వులు, నిమ్మకాయల దండలతోఅలంకరించి. ఆ తరువాత ఒక నిమ్మకాయను రెండు ముక్కలుగా కోసి రసం తీసేసి డొప్పల్లా చేసుకుని వాటిలో ఆవు నెయ్యి పోసి దీపారాధన చేయాలి.

దీపారాధన అనంతరం పూజ ప్రారంభించాలి. ముందుగా ఖడ్గమాలా స్తోత్రాన్ని పారాయణం చేసి అనంతరం దుర్గా స్తుతి, దుర్గా అష్టోత్తర శతనామాలను చదువుకోవాలి. ఆ తరువాత అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి. పులగం అంటే అమ్మవారికి చాలా ఇష్టమట. కాబట్టి పులగంతో పాటు పరమాన్నం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వాలి. పూజ పూర్తయిన తర్వాత ఒక ముత్తైదువుకు తాంబూలం ఇవ్వాలి. ఇలా తొమ్మిది వారాలు పూర్తయ్యాక చివరి వారం ఉద్యాపన చేయాలి. ఆ సమయంలో అమ్మవారి పేరు చెప్పి ముగ్గురు ముత్తైదువులకు భోజనం పెట్టి తాంబూలం ఇస్తే మన కష్టాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

Share this post with your friends