స్నానానికి ఉపయోగించే పదార్ధాన్ని బట్టి స్నానాలు ఎన్ని రకాలు?

స్నానానికి ఉపయోగించే పదార్థాన్ని బట్టి రెండు రకాలు. అవేంటో తెలుసుకుందాం.

ముఖ్య స్నానం : ఇది నీటిని ఉపయోగించి చేసేది ఇది మళ్ళీ రెండు రకాలు.

మంత్రం లేదా బ్రాహ్మ్యం : వేదములలో చెప్పబడిన నమక, చమక, పురుష సూక్తములను, మార్జన మంత్రాలను ఉచ్ఛరిస్తూ చేసేది “మంత్ర స్నానం”. మంత్రించిన నీళ్ళని నెత్తిమీద చల్లుకోవడమే బ్రాహ్మ్య స్నానం.

“ఓం ఆపోహిష్టామ యోభువః
తాన ఊర్జే దధాతన మహేరణాయచక్షసే
యోవశ్శివతమోరసః
తస్య భాజయతేహనః
ఉశతీరివ మాతరః
తస్మారంగా మామవో
యస్యక్షయాయ చ తనః
ఆపో జన యధాచనః ”

అనే మంత్రముతో పైన నీటిని చల్లుకుంటారు. పూజలు చేసేటప్పుడు కూడా గంగేచ, యమునేచ, గోదావరీ, సరస్వతీ, నర్మదా, సింధు, కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు అని నీళ్ళని మంత్రించి పూజాద్రవ్యాణి సంప్రోక్ష్య, దేవస్య, ఆత్మానం సంప్రోక్ష్య అని మంత్రించిన నీళ్ళని చల్లాకనే పూజా విధానాలు మొదలుపెడతాం.

వారుణం : ఇది మామూలు నీళ్ళతో చేసేది. మనమందరం ఎక్కువగా చేసేది ఇదే. మనలో నిరంతరం విద్యుత్తు ప్రవహిస్తూ, ఎప్పటికప్పుడు విద్యుచ్ఛక్తి ఉత్పత్తి అవుతూ, బయటకు పోతూ ఉంటుంది. ఇలా నిరంతరం జరుగుతూ ఉంటేనే మనం ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటాం. నిజానికి శుచితో పాటు నీళ్ళతో దేహాన్ని తడపడంవల్ల లోపల ప్రవహిస్తున్న విద్యుచ్ఛక్తిని బయటకు పంపడం కూడా స్నానపు ప్రధాన ఉద్దేశ్యం. అందుకే పొద్దున్నే స్నానం చేయాలనే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. శరీరం మీద నీళ్ళు పడినప్పుడు, ఆ నీళ్ళు లోపలి విద్యుచ్ఛక్తిని పీల్చుకుంటాయి. ఆ రకంగా లోపలి విద్యుచ్ఛక్తి బయటకు వెళ్తుంది. ఆ ప్రక్రియ మొదలవగానే చురుకుదనం ప్రవేశిస్తుంది. పుణ్య నదులలో స్నానం ఆచరించడాన్ని కూడా వారుణ స్నానం అంటారు.
అముఖ్యం లేదా గౌణ స్నానం : నీరు లేకుండా చేసే స్నానాన్ని గౌణ స్నానం అంటారు. ఇది అయిదు రకాలు

* ఆగ్నేయస్నానం : హోమ భస్మాన్ని లేపనంగా పూసుకోడాన్ని ఆగ్నేయ స్నానం లేదా విభూది స్నానం అంటారు. అంటే ఒంటి నిండా విభూతి పూసుకుంటే దానిని విభూతి స్నానం అంటారు. భస్మానికి మూడు హంగులు కావాలి. ఒకటి, కాలగలిగే పదార్ధం. రెండు, అది రాజుకుని అంటుకోడానికి తగినంత వేడి. మూడు, ఆ వస్తువు మండడానికి తగినంత ఆమ్లజని సరఫరా. అప్పుడే ఆ వస్తువు కాలుతుంది. కాలగా మిగిలిన దానిని బూడిద అంటాం. విభూది ఒక రకం బూడిదే అలానే నీరు కూడా ఒక రకం బూడిదే. ఉదజని వాయువుని ఆమ్లజని సమక్షంలో మండించగా మిగిలిన బూడిదే నీరు. కనుక, మండవలసిన పదార్ధం అంతా మండిపోగా మిగిలినవే బూడిద, నీళ్ళూను. బూడిద ఒంటినిండా రాసుకోడానికీ, నీళ్ళు ఒంటి మీద పోసుకోడానికీ మధ్య ఉన్న వైజ్ఞానిక పరమైన సారూప్యాన్ని మనవాళ్ళకి తెలిసే ‘విభూది స్నానం’ అన్న పేరు పెట్టడం జరిగింది.

శ్రీకరంచ పవిత్రంచ శోకరోగ నివారణం|
లోకే వశీకరణం పుంసాం భాస్మత్రైలోక్య పావనం||

పరమ పవిత్రమైన, అనారోగ్యాలను పోగొట్టే, సంపదలను చేకూర్చే, బాధలను నివారించే, అందరినీ వశంలో ఉంచుకునే విభూతిని ముఖాన పెట్టుకుంటున్నాను- అని ఈ శ్లోక భావం. విభూతి చర్మవ్యాధులను నివారిస్తుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ప్రతిరోజూ విభూతిని ధరించడం వల్ల రక్తంలో ఉండే దోషాలు, మలినాలు పోయి, రక్తప్రసరణ సవ్యంగా ఉంటుంది. విభూతి క్రిమినాశినిగా పనిచేస్తుంది. నుదురు, భుజాలు మొదలైన శరీర భాగాలపై స్వేదంవల్ల జనించిన క్రిములు కలిగించే రోగాలనుండి రక్షిస్తుంది. శరీర ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులు లేకుండా సమంగా ఉండేట్లు చేస్తుంది. ఆకలిని పెంచుతుంది.

ఉద్రేకాలను తగ్గించి, శాంత స్వభావాన్ని చేకూరుస్తుంది. విభూతి స్వచ్చమైన తెల్లటి రంగులో ఉంటుంది కనుక ఇది నిర్మలత్వానికి సంకేతం. విభూది అంటే ఐశ్వర్యం అనే భావన కూడా ఉంది కనుక ఈ విభూది స్నానం చేస్తే ఐశ్వర్యవంతులం అవుతామన్న ఉద్దేశ్యంతో కూడా దీనిని ఆచరిస్తాం.

Share this post with your friends