పాద ధూళితో శ్రీ కృష్ణుడికి చికిత్స చేస్తామన్న గోపికలు.. నారదుడి ఆగ్రహం

గోపాలుడు వ్రజగోపికల పట్లే తన్మయత్వం పొందుతున్నాడన్న ద్వేషంలో ద్వారకలోని దేవేరులంతా రగిలిపోయారు. అంతఃపురమంతా అసూయతో రగిలిపోయింది. దీనికి శ్రీకృష్ణుడు ఒక పరిష్కార మార్గం ఆలోచించాడు. అన్ని రోగాలకు మందొకటే. మాధవుడు రాణుల రోగం కుదిర్చేందుకు తనకో మాయరోగం కల్పించుకున్నాడని తెలుసుకున్నాం కదా. ఆ తరువాత ఏం జరిగిందంటే.. మాధవుడికి పాదధూళితో ఉపచారం చేయడం అపచారమని భావించి రాణులంతా ముఖం చాటేశారు. అచ్యుతుని ఆంతర్యం గ్రహించి లోలోన మురిసిపోతున్న నారదమునిని నందనందనుడు బృందావనం దర్శించి రమ్మన్నాడు.

ద్వారక నుంచి దేవర్షి వచ్చాడని విని రాధాదేవి వెంటరాగా గోపికలందరూ పరుగుపరుగున వచ్చి యోగేశ్వరుని యోగక్షేమాలు అడిగారు. విషయం విదితం కాగా ముదితలకి ముచ్చమటలు పోశాయి. ప్రాణాలు కడగట్టగా గోపికలు ఓపిక తెచ్చుకొని ‘అదేమిటి మహర్షీ! అంతటి మహానగరంలో మందిచ్చేవాడే కరవయ్యాడా?’ అని ఆతురతతో అడగ్గా నారదుడు ఔషధం సిద్ధంగా ఉందికాని అనుపానమే దొరకలేదన్నాడు. ‘అదేమి అనుపానం ఆర్యా?’ ఆశ్యర్యంగా అడిగారు గోపికలు. ‘మీ పాదధూళే ఆ అనుపానం. ఇవ్వగలరా’ అని నారదుడు ప్రశ్నించగా గోపకాంతలు ఎగిరి గంతేసి ఎంతో ఆనందంగా- ‘ఓస్‌! ఇంతేనా? మా పాదరజం ఎంత కావాలో తీసుకోండి మునివరా!’ అంటూ మహర్షి ముందు అందరూ కాళ్లు జాపారు. నారదుడు భయం నటిస్తూ ‘అరే! ఏమిటిది? కృష్ణుడు భగవంతుడని మీకు తెలియదా? ఆదిదేవునికి అనుపానంగా ఆరగించమని అరికాలి మట్టి ఇస్తారా? పాపం కాదా? మీకు నరకభయం లేదా?’ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ తరువాత ఏం జరిగిందో మరో కథనంలో తెలుసుకుందాం.

Share this post with your friends