జూలై 18 నుంచి శ్రీ కపిలేశ్వరాలయంలో పవిత్రోత్సవాలు

తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 18 నుంచి పవిత్రోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించనుంది. ఈ పవిత్రోత్సవాలు మూడు రోజుల పాటు అంటే ఈ నెల 20వ తేదీ వరకు జ‌రుగ‌నున్నాయి. ఇందుకోసం జూలై 17న సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ నిర్వహిస్తారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా శైవాగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.

ఇందులో భాగంగా జూలై 18న మొద‌టిరోజు ఉదయం ఉత్స‌వ‌మూర్తుల‌కు స్న‌ప‌న‌తిరుమంజ‌నం, ‌సాయంత్రం క‌ల‌శ‌పూజ‌, హోమం, ప‌విత్ర ప్ర‌తిష్ఠ నిర్వ‌హిస్తారు. జూలై 19న రెండో రోజు ఉద‌యం గ్రంథి ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ‌, ‌సాయంత్రం యాగ‌శాల‌పూజ‌, హోమం చేప‌డ‌తారు. జూలై 20న ఉద‌యం మ‌హాపూర్ణాహుతి, క‌ల‌శోధ్వాస‌న‌, ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ నిర్వ‌హిస్తారు. ‌సాయంత్రం 6 గంట‌ల‌కు పంచమూర్తులైన శ్రీ కపిలేశ్వరస్వామి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వరస్వామి, శ్రీ సుబ్రమణ్యస్వామి, శ్రీ చండికేశ్వరస్వామివార్లు పుర వీధుల్లో విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

Share this post with your friends