
కాణిపాకం వరసిద్ధి వినాయకుడి గురించి తెలియనిది ఎవరికి? ఈ ఆలయం సత్య ప్రమాణాలకు క్షేత్రమని చెబుతారు. తాజాగా ఈ ఆలయ ఈవోపై వేటు పడింది. దీంతో స్థానికులంతా క్షేత్రానికి పట్టిన గ్రహణం వీడిందంటూ సంబరాలు జరుపుకున్నారు. 4 ఏళ్లుగా ఆలయ ఈవోగా విధులు నిర్వర్తిస్తున్న వెంకటేశుపై ఆరోపణలు చాలానే ఉన్నాయి. ఉద్యోగుల పట్ల కక్ష సాధింపు, ఉభయదారులతో గొడవులు, అర్చకుల విషయంలో అనుచిత ప్రవర్తన, ఏకపక్ష నిర్ణయాలతో వెంకటేశు ప్రతి ఒక్కరికీ కంటకంగా మారారు. ఇక కాణిపాకం గణేషుడి బ్రహ్మోత్సవాల సమావేశం సందర్భంగా ఈవోతో తాడో పేడో తేల్చుకున్నారు.
సమావేశంలో ఈవో నిర్ణయాలన్నింటినీ తప్పుబట్టారు. సమావేశంలో పెద్ద ఎత్తున దూషణల పర్వం కొనసాగింది. పోలీసులు జోక్యం చేసుకుంటే కానీ వ్యవహారం ఓ కొలిక్కి రాలేదు. చివరకు ఈ వ్యవహారమంతా ప్రభుత్వ దృష్టికి వెళ్లింది. ఈవో వెంకటేశుపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. జీఏడీలో రిపోర్ట్ చేసుకోవాలంటూ వెంకటేశుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి ఆదేశాలు జారీ చేశారు. దీంతో స్థానికులు, ఉభయదారులు, ఒప్పంద ఉద్యోగులు, అర్చకులు అంతా కలిసి బాణా సంచా కాల్చి మరీ సంబరాలు జరుపుకున్నారు. కాణిపాకానికి పట్టిన గ్రహణం వీడిందంటూ గంతులేశారు.
