దేశంలో చాలా హిందూ మహిమాన్విత ఆలయాలు ఉన్నాయి. వాటిలో ఒకటి చౌసత్ యోగిని ఆలయం. మధ్యప్రదేశ్‌లోని మోరెనా జిల్లాలోని మితావాలి గ్రామంలో ఉంది. ఈఈ ఆలయం తంత్ర సాధనకు కేంద్రమని చెబుతుంటారు. భారతదేశంలో ఉన్న అన్ని యోగిని ఆలయాల్లోకి ఇదే ఫేమస్. ఇక్కడ ఒకప్పుడు తంత్ర విద్య కోసం భక్తులు ధ్యానం చేసేవారట. యోగిని ఆరాధన ద్వారా ఆధ్యాత్మిక శక్తిని పొందేవారట. అందుకే ఈ ఆలయాన్ని తాంత్రిక విశ్వవిద్యాలయమని అంటారు. ఈ ఆలయాన్ని క్రీ.శ. 1323లో రాజపుత్ర రాజులు వృత్తాకారంలో నిర్మించారు. ఈ ఆలయంలో 64 గదులు ఉన్నాయి. వాటిలో 64 శివలింగాలను ప్రతిష్టించారు.
ఈ ఆలయం వృత్తాకారంలో నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణం పార్లమెంటు భవనాన్ని పోలి ఉంటుంది. ఆలయం మధ్యలో బహిరంగ మంటపం ఉంది. ఈ మంటపంలో శివలింగాన్ని కూడా ప్రతిష్టించారు. ఈ మంటపం చుట్టూ 64 గదులు.. వాటిలో 64 శివలింగాలతో పాటు యోగిని విగ్రహాలను ప్రతిష్టించారు. ఈ ఆలయం శివుని తంత్ర సాధన కవచంలో కప్పి ఉంటుందని స్థానికుల నమ్మకం. ఇక రాత్రి వేళల్లో ఈ ఆలయ సమీపంలోకి వెళ్లేందుకు సైతం అనుమతి లేదు. దీనికి కారణం ఆ సమయంలో యోగినిలు మేల్కొని ఉంటారట. ఒకవేళ ఎవరైనా సాయంత్రం తర్వాత ఆలయం వైపునకు వెళితే జీవతం కోల్పోతారని అంటారు. అందుకే సాయంత్రం దాటాక అటుగా వెళ్లే సాహసం ఎవరూ చేయరు.