కొడుకు ఆ మంత్రం చెబితే కానీ తల్లి శరీరాన్ని వీడదట..

అమ్మలో సృష్టికారకత్వమైన బ్రహ్మతత్త్వమే కాదు, స్థితి కారకత్త్వమైన విష్ణుతత్త్వం కూడా ఉంటుందని చాగంటి వారు చెప్పారు. అమ్మ గురించి ఆయన ఆసక్తికర విషయాలు వెల్లడించారు. రక్షకత్వం అమ్మ నర-నరానా జీర్ణించుకుని ఉంటుంది. ఇది చంటితనంలో పాలివ్వడంలోనే కాదు, బిడ్డకు ఎన్నేళ్ల వయసొచ్చినా, పుట్టిన కొడుకు కృతఘ్నుడే అయినా వాడు నూరేళ్ళు బతకాలని అమ్మ కోరుకుంటుంది. నోములు,వ్రతాలు, పూజలు, ప్రార్థనలు అన్నీ బిడ్డ క్షేమం కోరే చేస్తుంది. ఆమెకు ఎంత వయసొచ్చినా ఇది అమ్మ లక్షణం.. అమ్మ స్థితికారకత్వం. శరీరం విడిచిపెట్టిన తరువాత అంత్యేష్ఠి సంస్కారం మంత్రవైభవంతో చెప్తారు. జీవుడు శరీరాన్ని వదలి వెళ్ళే దశల్లో చివరన వ్యానవాయువనేది జీవుడిని, శరీరాన్ని పట్టుకుని ఉంటుంది.

అలా పట్టుకుని ఉన్నప్పుడు – కన్నబిడ్డలనే కాదు, జ్ఞాతులందరినీ అపేక్షిస్తుంది. అందుకే జ్ఞాతులు 11 రోజులు మైలపడతారు. వారి సంక్షేమంకోసం కొడుకు 11వ రోజున శ్మశానంలోనే ఆనంద హోమం చేస్తాడు. ఆ సమయంలో కొడుకు వెళ్ళి శవరూపంలో ఉన్న అమ్మతో ఒకమాట చెప్తాడు…
“అమ్మా.. శరీరం జర్జరీభూతమైపోయింది. ఇంకా ఎన్నాళ్ళు పెట్టుకుంటావు మా మీద వ్యామోహం! అమ్మా! మేం సంతోషంగా ఉన్నాం. వదిలిపెట్టేయ్‌ శరీరాన్ని. వెళ్ళిపో. పోయి మంచి శరీరాన్ని పొందిరా. మళ్ళీ లోకంలో పుణ్యకర్మలు చేసుకో. వదిలిపెట్టెయ్‌!” అని కొడుకు చెప్పిన మంత్రానికి వదిలేస్తుంది శరీరాన్ని. అప్పటి వరకూ వదలదు. శిథిలమయిపోయిన భవనం మీద తన యాజమాన్య హక్కు పెట్టుకున్నట్లు జీవుడు(తండ్రికానీ, తల్లికానీ) శరీరాన్ని పట్టుకుని ఉంటాడు. కొడుకు చెప్పిన మంత్రంతో వదిలేస్తాడు. అదీ వాళ్ళిద్దరి అనుబంధం.

Share this post with your friends