మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉన్న అంగారక ఆలయం గురించి తెలుసుకున్నాం. అంగారకుని మాతృమూర్తిగా ఉజ్జయినిని పిలుస్తుంటారని చెప్పుకున్నాం. ఇక ఇక్కడ శివుడి రూపంలో అంగారకుడు పూజలందుకుంటూ ఉంటాడు. అసలు ఈ ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం. పూర్వం అంధకాసురుడనే రాక్షసుడు తన రక్తం నుంచి వందలాది రాక్షసులు జన్మించేలా పరమేశ్వరుడి నుంచి వరం పొందాడట. ఇక తనకు చిన్న గాయమైనా రక్తమొస్తే దాని నుంచి వందలాది మంది రాక్షసులు పుడతారన్న ధీమాతో.. వర గర్వంతో అందరినీ బాధించసాగాడట. దేవతలంతా శివుడికి మొరపెట్టుకోవడంతో ఆయనే అంధకాసురుడిని వధించాలని నిర్ణయించుకున్నాడట.
ఈ క్రమంలోనే శివుడు అంధకాసురుడితో స్వయంగా యుద్ధానికి దిగాడట. ఆ సమయంలో వీరిద్దరి మధ్య భీకర యుద్ధం జరిగిందట. శివుడి శరీరం నుంచి చెమట ధారలుగా ప్రవహించి ఆ వేడి కారణంగా ఉజ్జయిని నేత రెండుగా విడిపోయింది. ఆ విడిపోయిన నేల నుంచి అంగారక గ్రహం పుట్టిందట. మొత్తానికి అంధకాసురుడిని శివుడు సంహరించాడు. అయితే అంగారకుడి రక్తపు చుక్కల నుంచి వందల మంది రాక్షసులు పుడతారని తనే వరమిచ్చాడు కాబట్టి ఆ రక్తపు చుక్కలు నేలను తాకకుండా తనే స్వీకరించాడట. అందుకే అంగారక గ్రహం ఎరుపు రంగులో ఉంటుందని చెబుతారు. శివుడి చెమట నుంచి శివుడు ఉద్భవించాడు కాబట్టి అంగారకుడిని శివుడి పుత్రుడని అంటారు. అలాగే చెమట భూమిపై పడటంతో ఉద్భవించాడు కాబట్టి పృధ్వీ కుమారుడని కూడా అంటారు.