సంకష్ట గణపతి వ్రత కథ గురించి మీకు తెలుసా? ఇది విన్నా.. చదివినా కూడా చాలా పుణ్యం లభిస్తుందట. ఆ కథ ఏంటంటే.. స్వర్గలోకాధిపతి అయిన ఇంద్రుడు ఓసారి వినాయకునికి గొప్ప భక్తుడైన బృఘండి అనే ఋషిని సందర్శించి తిరిగి స్వర్గానికి బయలుదేరాడట. ఒక ప్రదేశంలోకి రాగానే విమానం అకస్మాత్తుగా ఆగిపోయిందట. అప్పుడు విమానం నుంచి ఓ అద్భుతమైన వెలుగు వచ్చిందట. అది చూసి ఆ ప్రాంతపు రాజు సురసేనుడు గబగబా బయటికి వచ్చి ఇంద్రుడిని చూసి ఆనందంతో నమస్కరించాడట. విమానం ఆగిపోవడానికి కారణమడగ్గా.. నీ రాజ్యంలో అత్యంత పాపాలు చేసిన వ్యక్తి దృష్టి సోకి విమానం ఆగిపోయిందని చెప్పాడట. మరి అదెలా బయలుదేరుతుందని అడగ్గా.. చతుర్థి రోజున ఉపవాసం చేసిన వారు వారి పుణ్యఫలాన్ని తనకిస్తే విమానం బయలుదేరుతుందని ఇంద్రుడు చెప్పాడట.
వెంటనే రాజు తన సైనికులను రాజ్యంలోకి ఉపవాసం చేసిన వారి కోసం పంపించాడు. కానీ రాజ్యమంతా వెదికినా అలాంటి వారు కనిపించలేదు. ఉసూరుమంటూ తిరిగొస్తుండగా గణేశ ధూత ఒకరు మరణించిన స్త్రీ శరీరంలో వెళ్లడం కనిపించింది. ఆ స్త్రీ చాలా పాపాలు చేసిందని.. అలాంటి పాపాత్మురాలిని గణేశ లోకానికి తీసుకెళ్లడమేంటని ధూతను ప్రశ్నించారట. దానికి ధూత.. ఆమె తెలిసో తెలియకో సంకష్ట చతుర్థి రోజున అత్యంత నిష్టగా ఉపవాసముందని.. ఆ పుణ్యమే ఆమెను గణేశ లోకానికి తీసుకెళ్లేలా చేసిందని తెలిపాడు. వెంటనే ఆ సైనికులు ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని, అలా చేస్తే ఆగిపోయిన ఇంద్ర విమానం తిరిగి బయలుదేరుతుందని చెప్పారు. కానీ దీనికి గణేశ ధూత అంగీకరించలేదు. అయితే ఆ స్త్రీని సోకిన గాలి కారణంగా అక్కడ విస్ఫోటనం చెలరేగి.. అది కాస్తా ఇంద్రుడి విమానాన్ని చేరడంతో అది బయలుదేరుతుంది. ఇదీ సంకష్ట చతుర్థి కథ.