నవగ్రహాల్లో సూర్యుడు ఒక గ్రహమే అయినా కూడా ఆయనకున్న ప్రాధాన్యత మరే గ్రహానికి లేదని చెప్పాలి. ఆరోగ్య ప్రదాతగా ఆయన్ను భక్తులు మొక్కుతూ ఉంటారు. అంతేకాకుండా యావత్ ప్రపంచానికి ఆయన వెలుగులు ప్రసరింప చేస్తూ జీవ వైవిధ్యాన్ని సంరక్షిస్తాడు. నవగ్రహ స్తోత్రంలో ఆదిత్య యాచ అంటూ మొదట మనం సూర్యదేవుడినే ప్రార్థిస్తూ ఉంటాం. అలాగే ఉదయాన్నే లేచి శుచిగా స్నానమాచరించి సూర్యుడికి అర్ఘ్యమిస్తాం. సూర్య దేవాలయాలు దేశంలో చాలా తక్కువ. అలాంటి ఆలయాల్లో తమిళనాడులోని కుంభకోణం సమీపంలో ఒక ఆలయం ఉంది. అది సూర్యనార్ కోవిల్. ఇక్కడ ఇతర గ్రహాలతో కలిసి సూర్యభగవానుడు కొలువై ఉన్నాడు.
సూర్యనార్ కోవిల్ ఈనాటిది కాదు.. చాలా పురాతన ఆలయం. క్రీ.శ. 11వ శతాబ్దంలో చోళ రాజైన కుళుత్తోంగ చోళుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి. అనంతరం దీనిని కొన్ని రాజవంశాలు అభివృద్ది చేశాయి. విజయనగర రాజులు, ఇతర రాజవంశాలు అభివృద్ది చేసిన ఈ ఆలయ ప్రాంగణంలో విశ్వనాథ, విశాలాక్షి, నటరాజ, శివకామి, వినాయక, మురుగన్ విగ్రహాలున్నాయి. వీటితో పాటు ప్రధాన మందిరానికి అతి సమీపంలోనే బృహస్పతి ఆలయం వుంది. అలాగే మిగిలిన ఏడు గ్రహాధిపతులకు సైతం ఈ ఆలయ ప్రాంగణంలోనే ప్రత్యేకమైన ఆలయాలున్నాయి.