
తొలి ఏకాదశి నుంచి ఈ నాలుగు నెలల పాటు చాతుర్మాసదీక్షను ఆచరిస్తారు. శ్రీ మహావిష్ణువు ఈ రోజు నుంచి నాలుగు నెలల పాటు నిద్రిస్తాడని చెబుతారు. ఈ నాలుగు నెలల పాటు చాతుర్మాస దీక్షను అనుసరిస్తారు. వాస్తవానికి ఈ పరిణామాలను పరిశీలిస్తే.. ఈ సమయంలో ప్రకృతిలో జరిగే మార్పులే (పంచ భూతాలు, సూర్య చంద్రులు, గ్రహాల గమనాలు) సంకేతంగా చెప్పుకోవచ్చు. ఈ సమయంలో బాగా గమనిస్తే.. ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు తొలి ఏకాదశి రోజు నుంచి దక్షిణ దిశకు వాలుతున్నట్లు కనిపిస్తాడు. ఈ విధంగా సూర్యుడు దక్షిణ దిశకు మరలినట్లు కనిపించడం దక్షిణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది.
అంతే కాకుండా ఇదే మాసంలో చాతుర్మాస వ్రతం కూడా ప్రారంభం అవుతుంది.ఎంతో మహిమాన్వితమైన ఈ తొలి ఏకాదశి పర్వదినాన వ్రతాన్ని ఆచరిస్తే అశ్వమేధ యాగం చేసినంత, 60 వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యఫలం లభిస్తుందని ఈ తొలి ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి హిందూ పురాణాలు చెబుతున్నాయి. మహాసాధ్వీ సతీ సక్కుభాయి ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి మోక్ష సిద్ధి పొందని కూడా చెబుతారు. అంతటి విశిష్టత కలిగిన ఈ ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించడమే మన కర్తవ్యం. ఒకవేళ కుదిరితే రాత్రంతా జాగరణ చేయాలి. నిర్మలైన మనస్సుతో విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణు భాగవతాన్ని పఠించడం చేయాలి.
