కర్మఫలం తప్పదనడానికి ఇంతకు మించిన ఉదాహరణ ఉండదేమో..

కర్మఫలం నుంచి తప్పించుకోలేమని అంటారు. దీనికి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నా కూడా ఒక కథ మాత్రం బాగా ప్రచారంలో ఉంది. అది జడ భరతుని కథ. రాకుమారుడైన జడ భరతుడికి బోగాలు, విలాసాలపై ఆసక్తి లేదు. నిత్యం దైవభక్తిలోనే ఉండేవాడు. తండ్రి తదనంతరం తప్పనిసరి పరిస్థితుల్లో రాజ్యపాలనను స్వీకరించాడు. ధర్మబద్దుడై పరిపాలన సాగించాడు. ఇక వృద్దాప్యం రాగానే రాజ్య పాలనను కుమారులకు అప్పగించి తను ఓ నదీ తీరంలో పర్ణశాల నిర్మించుకుని పునర్జన్మ లేకుండా ఉండే వరాన్ని కోరుతూ తపస్సు చేసుకోసాగాడు. ఒకరోజు అనుకోని సంఘటన జరిగింది. నదీ స్నానం చేసి భరతుడు ధ్యానంలో ఉండగా ఒక చూలింత అయిన లేడి నీళ్లు తాగేందుకు నది వద్దకు వచ్చింది.

ఆ సమయంలో పులి గాండ్రింపు ఒకవైపు.. ఆకాశం నుంచి పిడుగు పడటం మరోవైపు జరిగాయి. బెదిరిపోయిన లేడి భయంతో ఒక్క గంతు వేయగా దానికి ప్రసవమైంది. ఆ వెంటనే తల్లి లేడి నీళ్లలో కొట్టుకుపోగా.. పిల్లను భరతుడు కాపాడి పెంచుకోసాగాడు. దాని ప్రేమకు ముగ్దుడైన భరతుడు తపస్సునంతా పక్కనబెట్టేశాడు. అది ఏం చేసినా ఆనందించేవాడు. ఒక రోజు లేడి అడవిలోకి వెళ్లి తిరిగి రాలేదు. భరతుడు వెదికినా కనిపించకపోవడంతో లేడిపిల్లపై బెంగతో జబ్బున పడ్డాడు. తుది ఘడియలు రానే వచ్చాయి. ఆ సమయంలో లేడి పిల్ల వచ్చింది. దానిని చూస్తే దాని బాగోగులు ఎవరు చూస్తారనే బెంగతో మరణించాడు. వాస్తవానికి ధర్మ శాస్త్రం ప్రకారం ఒక జీవుడు అంత్య సమయంలో దేని గురించి ఆలోచిస్తూ ప్రాణాలు విడుస్తాడో ఆ జన్మను తీసుకుంటాడట. దీంతో పునర్జన్మ లేకుండా చేసుకోవాలనుకున్న భరతుడు తదుపరి జన్మలో లేడిలా జన్మించాడు.

Share this post with your friends