లాల్ దర్వాజా బోనాల సందడి కొనసాగుతోంది. మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజ.. పోతురాజుల ప్రదర్శనతో లాల్ దర్వాజా బోనాలు ప్రారంభమయ్యాయి. సింహవాహిని మహంకాళి అమ్మవారికి ఆలయ కమిటీ తరపున మాజీ చైర్మన్ మాణిక్‌ప్రభు గౌడ్ కుటుంబం తొలి బోనం సమర్పించింది. ఆ తరువాత పెద్ద ఎత్తున మహిళలు అమ్మవారికి బోనం సమర్పించారు. నిజాం VI మీర్ మహబూబ్ అలీ ఖాన్ కాలంలో లాల్ దర్వాజా బోనాలు వేడుకల సంప్రదాయం ప్రారంభమైంది. అప్పటి నుంచి అంటే116వ సంవత్సరాలుగా లాల్ దర్వాజా బోనాలు వైభవంగా కొనసాగుతున్నాయి.
ఈ ఆలయంతో పాటు ఆదివారం అక్కన్న మాదన్న ఆలయం, మీరాలం మండి మహంకాళి ఆలయం, మేళా ముత్యాలమ్మ ఆలయం , ఉప్పగూడ మహాకాళేశ్వర అమ్మవారి ఆలయం, ఇతర అన్ని ఆలయాలతో పాటు పాతబస్తీలోని మరో 23 ఆలయాలల్లో కూడా బోనాల వేడుకలు ఆదివారం ఏకకాలంలో జరగనున్నాయి. ఈ ఆదివారం జరిగే బోనాల కార్యక్రమంతో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో నెలరోజుల పాటు జరిగే బోనాలు ముగియనున్నాయి. నవరాత్రులు సందర్భంగా శ్రీ మహంకాళి అమ్మవారిని సుందరంగా అలంకరిస్తున్నారు. ప్రతిరోజూ పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకుంటున్నారు.