ఆషాఢం అంటేనే బోనాలు.. ఆదివారం వచ్చిందంటే హైదరాబాద్ జంట నగరాలు బోనాల పాటలతో మోతెక్కుతున్నాయి. ఆటపాటలతో, మేళ తాళాల నడుమ మహిళలంతా అందంగా ముస్తాబై బోనాలు అమ్మవారికి తీసుకెళుతున్నారు. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలతో నగరమంతా సందడిగా మారుతుంది. ఆషాఢ మాస బోనాలతో జంట నగరాలు ఊగిపోతున్నాయి. ఈ నెల 7న గోల్కొండ శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారి బోనాలతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తొట్టెల ఊరేగింపుతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.
అమ్మవారికి బోనం సమర్పించేందుకు స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున జనాలు వచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. పోయిన వారం బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఇక సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు, రంగం, ఏనుగు ఊరేగింపు.. ఆ తరువాత లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు.. ఆపై నగరం మొత్తమ్మీద అన్ని ఏరియాల్లోనూ బోనాల ఉత్సవాలు జరుగుతాయి. ఈ బోనాల ఉత్సవాలు 18వ శతాబ్దం నుంచి జరుగుతూ వస్తున్నాయి.