దసరా శరన్నవరాత్రులు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో మాదిరిగా చేసుకుంటారు. ఏపీలో అయితే పలు జిల్లాల్లో వేరువేరుగా జరపుకుంటారు. ఇక తెలంగాణలో మాత్రమే దసరా వచ్చిందంటే చాలు.. ‘బతుకమ్మ’ ఆడుతారు. తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ ఆట,పాటలతో తెలంగాణ దద్దరిల్లుతుంది. పండుగను తెలంగాణ రాష్ట్రంలో ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుంచి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ (గౌరి) పండుగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది. ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు.
సెప్టెంబరు, అక్టోబరు నెలలు తెలంగాణ ప్రజలకు పండుగల నెలలు. ఈ నెలలలో రెండు పెద్ద పండుగలు నిర్వహించుకుంటూ ఉంటారు. ఈ పండుగలకు కనీసం పదిహేను రోజులు అటువైపు, ఇటువైపు అంతా పండుగ సంబరాలు, కుటుంబ కోలాహలాలు, కలయకలతో సందడి వాతావరణం నెలకొంటుంది. ఈ పండుగలలో ఒకటి ‘బతుకమ్మ పండుగ’, మరొకటి దసరా (విజయ దశమి). అయితే బతుకమ్మ పండుగ మాత్రం, తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమయిన పండుగ. తెలంగాణ సాంస్కృతిక ప్రతీక. రంగు రంగుల పూలను త్రికోణాకారంలో పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ మహిళలంతా ఆడుతూ పాడుతూ తిరుగుతారు.