బతుకమ్మ అనేది తెలంగాణ ప్రజలకు ఎంత ప్రత్యేకమైన పండుగో చెప్పనక్కర్లేదు. వాస్తవానికి ఈ పండుగ వర్షాకాలపు చివరిలోనూ.. శీతాకాలపు తొలి రోజుల్లో వస్తుంది. అప్పటి వరకూ కురిసిన వర్షాలతో చెరువులన్నీ మంచి నీటితో నిండి ఉంటాయి. పైగా ఆ సమయంలో రకరకాల పువ్వులు రంగు రంగులలో ఆరుబయలలో పూసి ఉంటాయి. వీటిలో గునుగు పూలు, తంగేడు పూలు బాగా ఎక్కువగా పూస్తాయి. బంతి, చేమంతి, నంది వర్ధనం లాంటి పూలకు కూడా ఇదే సమయం. ఇవే మాత్రమే కాకుండా సీతాఫలాలు కూడా ఈ సమయంలో ఒక పెద్ద ఆకర్షణ.
జొన్న పంట సైతం కోతకు సిధ్ధంగా తలలూపుతూ ఉంటుంది. వీటన్నింటి నేపథ్యంలో తెలంగాణ ఆడపడుచులు ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతమయిన రంగురంగుల పువ్వులతో కీర్తిస్తూ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పాత్ర ఎంతో విశిష్టమైనదని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలంగాణ ప్రజలందరినీ ఈ పండుగ ఏకతాటి పైకి తీసుకొచ్చిందనడంలో సందేహం లేదు. ఉద్యమ సందర్భాల్లో బతుకమ్మతో ఊరేగింపులు చేసిన తెలంగాణ ప్రజలు తమ అస్తిత్వాన్ని సగర్వంగా ప్రకటించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరుణంలో బతుకమ్మ ఖండాంతరాలు దాటి ప్రాధాన్యత మరింతగా పెరిగిపోయింది.