ఒడిశాలోని ప్రఖ్యాత పూరి శ్రీ జగన్నాథ క్షేత్రంలో అత్యంత ఆసక్తికర పరిణామానికి మరికొన్ని గంటలే సమయం ఉంది. రేపు ఆలయంలోని రత్న భాండాగారాన్ని తెరవనున్నారు. ఈ మేరకు ఒడిశా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జగన్నాథుని క్షేత్రంలో ఓ రహస్య గది ఉంది. దానిలో ఐదు పెట్టెలున్నాయని.. వాటి నిండా అమూల్యమైన ఆభరణాలు ఉన్నాయట. ఆ గదిలోని ఖాజానాకు పాములు కాపలాగా ఉంటాయని చెబుతారు. ఈ క్రమంలోనే అధికారులు సైతం ఆ గది తలుపులు తెరిచేందుకు భయాందోళనకు గురవుతున్నారు. 1978 తర్వాత రత్న భాండాగారాన్ని తెరవబోతుండటం ఇదే మొదటిసారి.
మొత్తానికి రేపు ఈ రహస్య గదిలోని ఐదు పెట్టెల్లో ఉన్న అమూల్యమైన ఆభరణాలను లెక్కించబోతున్నారు. పాములు కాపలాగా ఉంటాయని పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో దానికి సంబంధించిన ఏర్పాట్లను సైతం ప్రభుత్వం చేసింది. పాములు పట్టడంలో నిష్ణాతులైన వారిని సిద్ధంగా ఉంచారు. ఒకవేళ పాము ఏమైనా కాటేస్తే అత్యవసర చికిత్స అందించేందుకు గాను వైద్యుల టీమ్‌ను సైతం సిద్ధం చేశారు. ఐదు కర్ర పెట్టెల నిండా విలువైన ఆభరణాలు ఉంటాయని నమ్మకం. బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రహస్య గదిని తెరిపిస్తామని హామీ ఇచ్చింది. దీనిలో భాగంగా నాలుగు దశాబ్దాల తర్వాత ఈ భాండాగారాన్ని తెరవనున్నారు.