అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం.. స్వామివారిని స్మరిస్తూ గుహకు బయలుదేరిన భక్తులు

అమర్‌నాథ్ యాత్ర 2024 ఇవాళ ప్రారంభమైంది. పవిత్ర గుహ దర్శనం కోసం నిన్ననే జమ్మూకశ్మీర్‌ గందర్‌బాల్ జిల్లాలోని బల్తాల్ బేస్ క్యాంప్‌కు మొదటి బ్యాచ్ భక్తులు చేరుకున్నారు. వారంతా ఇవాళ ఉదయం బేస్ క్యాంప్ నుంచి అమర్‌నాథ్ యాత్రకు బయలుదేరారు. బం బం భోలే, హర హర మహాదేవ్ అంటూ శివయ్యను స్మరిస్తూ భక్తులు యాత్రనుసాగిస్తున్నారు. శ్రీనగర్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో దాదాపు 13 వేల అడుగుల ఎత్తులో అమర్‌నాథ్ గుహ ఉంటుంది. భక్తులంతా అక్కడికి చేరుకోవడంతో ఈ ప్రయాణం ముగుస్తుంది. నేటి నుంచి ఈ యాత్ర 52 రోజుల పాటు అంటే ఆగస్టు 19 వరకూ కొనసాగుతుంది.

అమర్‌నాథ్‌లోని పవిత్ర గుహలో శివుడు మంచు లింగం రూపంలో ఉంటాడు. ఈ మంచు శివలింగం సహజసిద్ధంగా ఏర్పడుతుంది. దీనిని ‘బాబా బర్ఫానీ’ అని పిలుస్తారు. ఇలా మంచుతో ఏర్పడే శివలింగం ప్రపంచంలోనే ఇది ఒక్కటే కావడం విశేషం. అందుకే ఈ యాత్రకు ప్రపంచ వ్యాప్తంగా భక్తులు వస్తుంటారు. ఆషాఢమాసం పౌర్ణమి నుంచి ఈ యాత్ర ప్రారంభమై శ్రావణ పూర్ణిమ వరకూ కొనసాగుతుంది. వాస్తవానికి ఈ యాత్ర అంత సులభమేమీ కాదు. అనేక సవాళ్లతో కూడుకున్నది. కొన్నిసార్లు వర్షాలు, కొన్నిసార్లు చల్లని వాతావరణం చాలా ఇబ్బందికరంగా పరిణమిస్తూ ఉంటుంది. అయినా సరే.. వాటన్నింటినీ దాటుకుని భక్తులు శివయ్యను దర్శించుకుంటారు.

Share this post with your friends