అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన ఆదివారం ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనంపై గోవర్ధనగిరిదారుడి అలంకారంలో స్వామివారు కటాక్షించారు.
సూర్యప్రభ వాహనం – ఆయురారోగ్యప్రాప్తి
సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్యప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ, సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యున్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. సూర్యప్రభ వాహనంలో స్వామివారిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. కాగా రాత్రి 7 నుండి 8 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. వాహన సేవలో ఆలయ ఏఈఓ శ్రీ రమేష్, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ శివకుమార్, కంకణ భట్టర్ శ్రీ సూర్య కుమార్ ఆచార్యులు, విశేష సంఖ్యల భక్తులు పాల్గొన్నారు.
జూన్ 24న రథోత్సవం
శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన సోమవారం రథోత్సవం వైభవంగా జరుగనుంది. ఉదయం 9 గంటలకు స్వామివారు రథారోహణం చేస్తారు. ఉదయం 9.25 నుంచి 11 గంటల వరకు రథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి 7 నుండి 8 గంటల వరకు అశ్వవాహనంపై స్వామివారు విహరించి భక్తులను కటాక్షించనున్నారు.