ఈ దేవుడికి ఏకంగా 56 రకాల నైవేద్యాలు.. కారణమేంటంటే..

హిందూమతంలో భగవంతుడి పూజ అనంతరం నైవేద్యం సమర్పించడం సర్వసాధారణమే. అయితే ఒక్కో దేవుడికి ఒక్కో ఇష్టమైన నైవేద్యం ఉంటుంది. ఇక నైవేద్యం అనేది ఒకటి లేదంటే రెండు రకాలు మహా అయితే పది రకాలు సమర్పిస్తారు. ఈ దేవుడికి మాత్రం ఏకంగా 56 రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. ఆయన మరెవరో కాదు.. పూరి జగన్నాథుడు. ఆయనకు గరిష్టంగా 56 రకాల నైవేద్యాలను సమర్పిస్తారు. ఇక నైవేద్యం సమర్పించిన అనంతరం వేప పొడిని కూడా సమర్పించే సంప్రదాయం శతాబ్దాలుగా ఇక్కడ కొనసాగుతోంది. వేపపొడిని ఎందుకు సమర్పిస్తారంటే.. పురాణాల ప్రకారం శ్రీ కృష్ణుని తల్లి యశోద అతనికి రోజుకు ఎనిమిది సార్లు ఆహారం పెట్టేదట.

ఇంద్రదేవుని కోపాగ్ని నుంచి శ్రీకృష్ణుడు గోవర్థన గిరిని చిటికెన వేలుపై ఎత్తి గోకులాన్ని రక్షించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో శ్రీకృష్ణుడు ఆహారం లేదా నీరు తీసుకోలేదట. ఇంద్రుడు వర్షాన్ని సుమారు 7 రోజులు కురిపిస్తూనే ఉన్నాడు. అయినా సరే.. మూడు రోజుల పాటు ఆహారం తీసుకోకుండా అలాగే గోవర్థన గిరిని తన చిటెకెన వేలుపై మోస్తూ ఉన్నాడట. ఇంద్రుడి కోపం తగ్గి.. వర్షం ఆగిపోయినప్పుడు శ్రీ కృష్ణుడు గోవర్ధన పర్వతం కింద ఉన్న వారందరినీ ఇళ్లకు పంపాడట. తన కుమారుడు వారం రోజుల పాటు ఆకలి, దాహంతో ఉండటంతో యశోద చాలా బాధ పడిందట. అప్పుడు కన్నయ్యకు గోకులంలోని వారు 7 రోజుల పాటు ఆహారాన్ని తయారు చేసి పెట్టారట. ఇలా రోజుకి 8 సార్ల చొప్పున 7×8 = 56 రకాల వంటకాలు వండి శ్రీ కృష్ణుడికి పెట్టారట. అప్పటి నుంచి శ్రీకృష్ణుడికి 56 రకాల నైవేద్యాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.

Share this post with your friends