తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన సోమవారం ఉదయం స్వామివారు మోహినీ అవతారంలో దర్శనమిచ్చారు. ఇవాళ రాత్రి గరుడ వాహనంపై స్వామివారు ఊరేగనున్నారు. ఇక ఆదివారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు కల్పవృక్ష వాహనంపై భక్తులను కటాక్షించారు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవ వైభవంగా జరిగింది. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాల కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
ప్రకృతికి శోభను సమకూర్చేది చెట్టు. అనేక విధాలైన వృక్షాలు సృష్ఠిలో ఉన్నాయి. అందులో మేటి కల్పవృక్షం. ఇతర వృక్షాలు తమకు కాచిన ఫలాలను మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక కల్పవృక్షం వాంఛిత ఫలాలనన్నింటినీ ప్రసాదిస్తుంది. సముద్రమథనంలో సంకల్ప వృక్షంగా ఆవిర్భవించిన దేవతావృక్షం కల్పవృక్షం. భక్తుల కోరికలు తీర్చే స్వామివారు ఈ కల్పవృక్షాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహిస్తాడు. అనంతరం ఉదయం 9.30 నుంచి10.30 గంటల వరకూ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనాలతో అభిషేకం చేశారు.