రాక్షసులను హింసించవద్దని హనుమకు చెప్పిన సీతాదేవి

సీతాదేవి ధర్మమూర్తి, దయాశీలి, ధైర్యశాలి మాత్రమే కాదు.. ఆమెలోని గుణగణాలు ఎన్నో ఉన్నాయి. వాటి గురించి కూడా తెలుసుకుందాం.

అభిమానవతి..
సీతకు ఆత్మాభిమానం ఎక్కువ. చిత్రకూటానికి సీతారాములు వచ్చారని తెలిసి, ఆమె తండ్రి జనకుడు వారిని కలిసి వనవాసం పూర్తయ్యేదాకా మిథిలా నగరానికి వచ్చి తనతో పాటు ఉండమని కోరినప్పుడు, ఆ మాటలను సున్నితంగా తిరస్కరించిన ఆత్మాభిమాని సీత. మెట్టినింటి కొచ్చాక ఎన్ని విషమ పరిస్థితులు ఎదురైనప్పటికీ తమే పరిష్కరించు కోవాలి గానీ, పుట్టింటి వారిని ఇబ్బంది పెట్టకూడన్న అభిమానవతి సీత.

రాక్షసులను హింసించవద్దని హనుమకు చెప్పిన సీతాదేవి
రాక్షసులను హింసించవద్దని హనుమకు చెప్పిన సీతాదేవి

వివేకవంతురాలు..
రావణాసురుడు తనను అపహరించి తీసుకెళ్లిపోతున్నప్పుడు, రాముడికి తన ఆనవాళ్లు చిక్కడం కోసం బంగారునగలను నేల మీద జారవిడిచిన వివేకవంతురాలు సీత.

ప్రేమమూర్తి..
సీతకు రామునిపై ఎంతటి ప్రేమానురాగాలంటే..ఆ ప్రేమలో తనను తానే మైమరిచిపోయేది. రావణుడి చెరలో బందీగా ఉండి కూడా నిత్యం శ్రీరామనామస్మరణ చేస్తూ అనుక్షణం పతి క్షేమాన్ని కోరేది.

చైతన్యశీలి..
సీత ఎంత చైతన్యశీలి అంటే అపాయంలో కూడా భయంతో ఆమె శత్రువులకు లొంగలేదు. రావణడు సీతను బెదిరించి, తన వశం కావాలని ఆదేశించినప్పుడు, ఒక గడ్డిపరకను అడ్డంగా పెట్టుకొని నువ్వు నాకు దీనితో సమానం అని చెప్పకనే చెప్పి అతని ధర్మహీనతను ప్రశ్నించిన ప్రజ్ఝావంతురాలామె.

క్షమాగుణం
రాక్షస సంహారం తర్వాత సీతను అశోకవనం నుంచి విడిపించి తీసుకువెళ్తున్న సమయంలో, తను బందీగా ఉన్నప్పుడు ఆ వనంలో తనను మాటలతో హింసించిన రాక్షసులకు ఏ కీడు తలపెట్టవద్దని, వారు స్వామిభక్తితో తమ బాధ్యతను మాత్రమే నిర్వర్తించారని హనుమంతునితో చెప్పిన క్షమాగుణం సీత సొంతం.

ఆదర్శమూర్తి
అడవిలో ఆశ్రమవాసిగా కాలం గడుపుతూ కూడా తన కుమారులను ప్రయోజకుల్ని చేయాలని ఎల్లవేళలా తపిస్తూ, వారిని కార్యసాధకులుగా తీర్చిదిద్దడం ఆమె ఉత్తమ పెంపకానికి నిదర్శనం…

Share this post with your friends