గుజరాత్‌లోని సారంగపూర్‌లో కొలువుదీరిన కష్టభంజన్ హనుమంతుడి ఆలయం ఉంటుంది. ఇక్కడి హనుమ పాదాల చెంత శనిదేవుడు కూడా కొలువుదీరాడు. దీనికి సంబంధించిన ఒక పౌరాణిక కథ కూడా ప్రచారంలో ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వ్యక్తి కర్మలను అనుసరించి శిక్షలు విధించడం అనేది శని భగవానుడి పని. హనుమ మాత్రం శనితో ‘జీవులు కర్మఫలాన్ని అనుభవించాలన్నది నిజమే కానీ, నీవు వేసే కఠిన శిక్షలు నా భక్తులకు వేయడం వంటివి తట్టుకో లేకుండా ఉన్నారు కాబట్టి నీ ప్రతాపాన్ని కొంత తగ్గించుకో” అని చెప్పాడట. అయితే శని దేవుడు అంగీకరించలేదట. ఈ నేపథ్యంలోనే శనిదేవుడికి హనుమంతుడికి మధ్య యుద్ధం జరిగింది. హనుమంతుడి బలపరాక్రమాల ముందు శనిదేవుడి నిలవలేకపోయాడట. ఆ యుద్ధంలో శని దేవుడి శక్తి క్షీణించిందట.

అప్పుడు శని శరణు వేడటంతో ఆంజనేయుడు శాంతించాడట. అప్పుడు శని వేసే శిక్షలు తీవ్రంగా ఉండకూడదని, తన భక్తులను బాధించకూడదని శనిదేవుడికి హనుమ షరతు విధిస్తాడు. హనుమ విధించిన షరతుకు శని అంగీకరించి ఆయన పాదాల వద్దనే కొలువుదీరాడట. కాబట్టి ఈ ఆలయంలో హనుమను దర్శిస్తే శని బాధల నుంచి, సకల దుఃఖాలు నుంచి ఉపశమనం లభిస్తుందని విశ్వాసం. కష్టభంజన్ దేవ్ హనుమాన్ మందిరానికి ముఖ్యంగా శనివారం నాడు అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. దీనికి కారణం.. ప్రతి శనివారం ఈ ఆలయంలో శారీరక, మానసిక అనారోగ్యాలు, దుష్ట గ్రహ పీడలు, ఇతర రుగ్మతలతో బాధపడే వారి కోసం ప్రత్యేక పూజలు జరుగుతాయి. మానసిక రుగ్మతలతో బాధపడేవారంతా శనివారం ఈ ఆలయానికి వస్తారు. అత్యంత మహిమాన్వితమైన, శక్తివంతమైన ఈ హనుమాన్ ఆలయాన్ని మనం కూడా దర్శించుకుని దుఃఖ విముక్తులమవుదాం.
