యోగుల లక్షణాలను శ్రీకృష్ణుడు ఏమని చెప్పాడు?

నిర్మానమోహా జితసంగదోషా
అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః।
ద్వంద్వైర్విముక్తాః సుఖదుఃఖసంజ్ఞైః
గచ్ఛంత్యమూఢాః పదమవ్యయం తత్।।

ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు పరమపదాన్ని పొందే యోగుల లక్షణాలను స్పష్టంగా చెబుతున్నాడు. మనసులో ‘నేనే’ అనే గర్వం లేకుండా ఉండేవారు మాత్రమే ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగగలరు. మానవుడు తన బంధములను, సంబంధాలను, గర్వాన్ని వదలకపోతే అతను భక్తి మార్గంలో నిలదొక్కుకోలేడు. ఇక మోహం లేకపోవడం అంటే తాత్కాలికమైన భౌతిక ఆకర్షణలలో పడకపోవడం. మోహం కలిగితే ఆత్మ జ్ఞానం మరుగునపడుతుంది. సంగ దోషాన్ని జయించడం అనగా చెడు స్నేహాలు, చెడు పరిసరాలు, అనర్థకమైన బంధాలను దూరం పెట్టడం. వీటిని అధిగమించినవారికి మాత్రమే మనశ్శాంతి కలుగుతుంది. ఆధ్యాత్మం అంటే మనలోని నిజమైన ఆత్మను తెలుసుకోవడం. ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక ధ్యానంలో నిమగ్నుడై ఉండే వాడు జీవన పరమార్థాన్ని గ్రహిస్తాడు.

కామనలన్నింటినీ విసర్జించి, రాగద్వేషాల ద్వంద్వాల నుండి బయటపడినవారే నిజమైన విముక్తులు. సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా సమబుద్ధితో నిలబడే వాడే పరమపదాన్ని చేరగలడు. ఇలాంటి అమూఢులు (మోహరహితులు, వివేకవంతులు) మాత్రమే అవ్యయమైన, నశించని పరమపదాన్ని పొందుతారు. ఈ శ్లోకం మనకు చెప్పేది – గర్వం, మోహం, రాగద్వేషాలను అధిగమించి, కామనలను వదలి, సమబుద్ధితో ఆధ్యాత్మిక మార్గంలో నడిస్తేనే నిజమైన విముక్తి సిద్ధిస్తుంది. సుఖదుఃఖాలకు అతీతుడై, భౌతిక మోహాలను జయించిన వాడే శాశ్వతమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతాడు. యోగి లక్షణాలు ఏంటంటే.. గర్వం లేకపోవడం, మోహాన్ని విడిచిపెట్టడం, చెడు సంగతులను జయించడం, ఆధ్యాత్మికతలో నిత్యంగా ఉండటం, కామనలను త్యజించడం, సుఖదుఃఖాలలో సమత్వం కలిగించడం. ఇవి ఆచరిస్తేనే మనిషి అవ్యయమైన పదాన్ని పొందుతాడు.

Share this post with your friends