
స్వామి, కళ్ళు మూసి ఉంచి ధ్యానములో కూర్చుంటే పర్వాలేదు కానీ, అదే కళ్ళు తెరిచి కూర్చుంటే బాహ్య ప్రపంచపు ఆలోచనలు ఇబ్బంది పెడుతున్నాయి. ఏమి చెయ్యమంటారని రమణ మహర్షిని ఓ భక్తుడు అడిగితే ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు. కళ్ళు తెరచి ఉంచినంత మాత్రాన ఏమి అవుతుంది? ఎలాగైతే నీవు ఇంట్లో కిటికీలు తెరచుకుని నిద్రపోతావో.. అలాగే మనసును నిద్ర పోయేలా చెయ్యగలిగితే కళ్ళు తెరచి ఉంచినా ఇబ్బంది ఉండదు. మనస్సును బాహ్య ప్రపంచపు వ్యవహారాల నుంచి దూరంగా ఉంచాలని ఎంత ప్రయత్నించినా, దానిని నియంత్రించుట మాకు సాధ్యపడడం లేదు స్వామి.
ఎలాగయితే చిన్న పిల్లవాడు తన నీడను తానూ పట్టుకోవాలని పరిగెడుతూ, పట్టుకోలేక ఏడుస్తుంటే తల్లి వచ్చి వాడిని ఆ పని చెయ్యకుండా అడ్డుకుంటుందో, అదే విధముగా మనము కూడా మన మనస్సు ఎటూ వెళ్ళకుండా అడ్డుకోవాలి. దాని కోసం వేదాంతమును వినడమో.. దానిపై ధ్యానము చేయుట ద్వారా మనస్సును అదుపులో పెట్టవచ్చు. మనము చేయవలసిందల్లా బాహ్య ప్రపంచపు వ్యవహారాల నుంచి దూరంగా ఉండాలి. అప్పుడు మిగిలేది ఆనందమే. ఆనందము మన స్వభావము. దాని కోసము మనము ఎక్కడ వెతకక్కరలేదని రమణ మహర్షుల వారు సమాధానం ఇచ్చారట.
