
శ్రీ మధ్వాచార్యుల వారు నిరాటంకంగా.. ద్వాదశ స్తోత్రంలోని అయిదు అధ్యాయాల రచన పూర్తి చేశారు. ఆరవ అధ్యాయం ప్రారంభం కాబోతున్న సమయంలో, ద్వారక నుంచి సరుకులు తీసుకువస్తోన్న ఒక నౌక తీరం వెంట వెళుతుండగా, అకస్మాత్తుగా, విపరీతంగా గాలులు ప్రారంభమయ్యాయి. ఈ గాలులకు సముద్ర కెరటాలు, ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. నౌక ప్రమాదంలో చిక్కుకుంది. దానిని రక్షించుకోవడానికి, అందులోని నావికులు చేస్తున్న ప్రయత్నాలు, ఫలించడం లేదు. క్రమంగా నౌకలోకి నీరు చేరడం ఆరంభమైంది. ఏ క్షణాన్నైనా, నౌక మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది.
నావికులందరూ భయాందోళనలకు గురైన సమయంలో, చివరి ప్రయత్నంగా, నౌకకు సంబంధించిన ముఖ్య వ్యాపారి ఒకతను, తీరం వైపు చూస్తూ, రక్షించేవారి కోసం ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. అంత దూరం నుంచి కూడా, ఒడ్డున నిశ్చలంగా కూర్చొని రచన చేసుకుంటున్న శ్రీ మధ్వాచార్యుల వారు, ఆ వ్యాపారికి స్పష్టంగా గోచరించారు. ఆయననుద్దేశించి, మరింత ఆర్తితో ప్రార్థించసాగాడు. ద్వాదశ స్తోత్ర రచనలలో లీనమై ఉన్నప్పటికీ, అంతటి హోరు గాలిలోనూ అంత దూరం నుంచి వ్యాపారి చేస్తున్న ప్రార్థన, మధ్వాచార్యుల చెవిని తాకింది. అప్రయత్నంగా అటుకేసి తల తిప్పారు. జాలి కలిగింది. వెంటనే తన ఉపవస్త్రం, ఒక కొసను పట్టుకుని గాలిలో నావ కేసి విసిరి, వెనక్కు తీసుకున్నారు. అంతే, ఆ క్షణం వరకూ సముద్రంలో మునిగిపోతుందా? అన్నట్లున్న నౌక, ఒక్కసారిగా స్తబ్దతకు వచ్చింది. ఎవరో తాళ్లు పట్టి లాగినట్లుగా, తీరానికి చేరి స్థిరంగా నిలిచింది.
