ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి సమీపంలోని వెంకటపాలెం వద్ద వున్న శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాన్ని మగళవారం టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామల రావు సందర్శించారు. ఆలయ అభివృద్ధికి టీటీడీ సిబ్బంది గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన రోజువారి వివరాలను టిటిడి ఈవోకు ఆలయ అధికారులు వివరించారు. శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి నిలిచిపోయిన అభివృద్ధి పనులను, నిర్మాణానికి సంబంధించిన వివరాలను, ఆలయంలో రోజువారి జరుగుతున్న కైంకర్యాలను, దాతల సహకారంతో ఇప్పటికే జరుగుతున్న అన్నదాన కార్యక్రమ వివరాలను.. ఇతర కార్యక్రమాలను ఈవోకు అధికారులు తెలియజేశారు.
టీటీడీ సిబ్బందికి అవసరమైన క్వార్టర్స్ , అన్నదానానికి అవసరమైన భవనాలు, భక్తులు వేచి ఉండేందుకు హాల్, స్వామివారి వాహనాల కోసం వాహనమండపం, ఆహ్లాదకరంగా గార్డెనింగ్ ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆలయ నిర్మాణానికి ముందు తయారు చేసిన ప్లాన్ ప్రకారం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించాలని టీటీడీ ఇంజనీరింగ్ అధికారులను ఈవో ఆదేశించారు. నూతన ఆంగ్ల సంవత్సరాది జనవరి 1వ తేదీ, వైకుంఠ ఏకాదశి రద్దీ నేపథ్యంలో భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అంతకుముందు ఆలయానికి ఈవో చేరుకోగానే సాంప్రదాయ బద్ధంగా ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికి వేదశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, డిప్యూటీ ఈఈ శ్రీ నాగభూషణం, సూపరెంటెంట్ శ్రీ మల్లికార్జున, టెంపుల్ ఇస్పెక్టర్ రామకృష్ణ, అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీ జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.