సింహాచలం అప్పన్న ఆలయ ఘటన మరువక ముందే గోవాలోని ఓ ఆలయంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఇక్కడి శిర్గావ్‌లో గల లైరాయ్ ఆలయంలో శుక్రవారం నుంచి జాతర జరుగుతోంది. ప్రతి ఏటా పెద్ద ఎత్తున జాతరను నిర్వహించడం ఆనవాయితీ. ఈ జాతరకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దీంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. 50 మంది గాయపడ్డారు. అయితే క్షతగాత్రుల్లోనూ కొంత మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం.
లైరాయ్ అమ్మవారిని దర్శించుకునేందుకు గోవా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. అయితే అంచనాకు మించి భక్తులు రావడంతో పాటు రద్దీని నియంత్రించే ఏర్పాట్లేమీ ఆలయ నిర్వాహకులు చేయలేదు. జాతరలో భాగంగా నిప్పులపై నడిచే సంప్రదాయం ఉంది. నిప్పులపై నడిచేందుకు శనివారం తెల్లవారుజామున వేలాది మంది తరలి రావడంతో రద్దీ పెరిగిపోయి పరిస్థితి అదుపు తప్పి తొక్కిసలాట జరిగింది. ఎమర్జెన్సీ సర్వీసెస్ సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.