శాస్త్రోక్తంగా చాతుర్మాస దీక్ష సంకల్పం తీసుకున్న జీయంగార్లు..

తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం ఉదయం శ్రీశ్రీశ్రీ పెద్దజీయంగారి చాతుర్మాస దీక్ష సంకల్పం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. శ్రీ వైష్ణ‌వ సంప్ర‌దా‌యక‌ర్త శ్రీ రామానుజాచార్యుల పారంప‌ర్యంలో చాతుర్మాస దీక్ష విశేషమైంది. ఆషాడ శుద్ధ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్లి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటారని ప్రాశస్త్యం. కావున ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస్యం అంటారు. చాతుర్మాస వ్రతం ప్రాచీనకాలం నుండి ఆచరణలో ఉన్నట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. ముందుగా శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్దజీయ‌ర్ స్వామి మ‌ఠంలో క‌ల‌శ స్థాప‌న, క‌ల‌శ పూజ‌, విష్వక్సేనారాధన, మేదినిపూజ, మృత్సంగ్రహణం శాస్త్రోక్తంగా నిర్వ‌హించారు.

త‌రువాత సేక‌రించిన పుట్ట మ‌న్నుకు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి చాతుర్మాస సంక‌ల్పం స్వీక‌రించారు. అనంత‌రం ‌‌శ్రీ పెద్దజీయంగారు తిరుమల బేడి ఆంజనేయస్వామివారి ఆలయం పక్కనగల జీయ్యంగారి మఠం వద్ద నుండి శ్రీ చిన్నజీయంగారు మరియు ఇతర శిష్యబృందంతో బయల్దేరారు. తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ స్వామి పుష్కరిణి, శ్రీ వరాహస్వామివారి బాలాలయాన్ని సందర్శించారు. అక్కడినుంచి మంగళవాయిద్యాలతో శ్రీవారి ఆలయానికి విచ్చేశారు. శ్రీ జీయంగార్లు శ్రీవారిని దర్శించుకున్న తరువాత శ్రీ పెద్దజీయంగారికి మేల్‌చాట్‌ వస్త్రాన్ని, శ్రీ చిన్నజీయంగారికి నూలుచాట్‌ వస్త్రాన్ని బహూకరించారు.

Share this post with your friends